Congress: ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ల సమావేశం

by S Gopi |
Congress:  ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ల సమావేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులకు సిద్ధమవుతోంది. దీనికోసం దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 27, 28, ఏప్రిల్ 3వ తేదీల్లో జిల్లా అధ్యక్షుల జాతీయ సదస్సును నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలను పునరుద్ధరించి పార్టీ కార్యకలాపాలకు వాటిని కీలకమైన కేంద్రంగా మార్చాలనే కాంగ్రెస్ జాతీయ నాయకత్వ ప్రణాళికలో భాగంగా ఈ సదస్సు జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో నిర్ణయాధికారం డీసెంట్రలైజ్ చేసేందుకు ఈ కార్యక్రమ తొలి అడుగుగా భావిస్తున్నామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ల సమావేశం జరిగింది. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో ఖర్గే ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న ఏఐసీసీ సమావేశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మీడియాతో అన్నారు. ఏప్రిల్‌ 8న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం, మరుసటి రోజు ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. అలాగే మార్చి 27, 28, ఏప్రిల్ 3 తేదీల్లో ఇందిరా భవన్‌లో అన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రమేష్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీని పటిష్టం చేసి సంస్థాగతంగా బలోపేతం కావడమే ఈ సభ ఉద్దేశ్యమన్నారు.

Next Story

Most Viewed