Trump: ఊహాజనిత, తప్పుడు సమాచారం.. పుతిన్ తో ట్రంప్ సంభాషణ జరగలేదన్న రష్యా

by Shamantha N |
Trump: ఊహాజనిత, తప్పుడు సమాచారం.. పుతిన్ తో  ట్రంప్ సంభాషణ జరగలేదన్న రష్యా
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంభాషణ జరుగిందని వార్తలొచ్చాయి. కాగా.. ఉక్రెయిన్- రష్యా యుద్ధం గురించి ఇరుదేశాల నేతలు మాట్లాడుకున్నట్లు వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. వారిద్దరి మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని రష్యా (Russia) వెల్లడించింది. దీనిని ఉద్దేశించే రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుంచి స్పందన వచ్చింది. ‘‘సమాచారం నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఈ వార్తలు చూస్తుంటే తెలుస్తోంది. పేరున్న సంస్థలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఇన్ ఫర్మేషన్ పూర్తిగా అవాస్తవం. ఇదంతా ఊహాజనిత, తప్పుడు సమాచారం’’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఇద్దరు నేతల మధ్య చర్చల కోసం ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని తెలిపారు.

వాషింగ్టన్ స్టోరీలో ఏముందంటే?

అధికారంలోకి వస్తే ఒక్క రోజులోనే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ కామెంట్స్ చేశారు. అందుకు తగ్గట్లే ఆయన ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధాన్ని ప్రారంభించబోనని, దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ భరోసానిచ్చారు. అంతేకాకుండా, అదే కాల్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కూడా జెలెన్‌స్కీతో మాట్లాడారు. అయితే, గత గురువారం ఫోర్లిడాలోని తన ఎస్టేట్‌ నుంచి ట్రంప్‌.. పుతిన్‌తో ఫోన్‌ (Trump Spoke With Putin)లో మాట్లాడినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ స్టోరీ వెలువరించింది. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు, యుద్ధంపై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు ట్రంప్ సూచించినట్లు తెలిపింది. దీనిపైనే మాస్కో ఈవిధంగా స్పందించింది.

Advertisement

Next Story

Most Viewed