సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరో దళిత జడ్జి!

by Swamyn |
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరో దళిత జడ్జి!
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రసన్న బీ వరాలేకు పదోన్నతి లభించనుంది. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు వరాలే పేరును కొలీజియం శుక్రవారం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆయన నియామకాన్ని కేంద్రప్రభుత్వం ఆమోదిస్తే, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జీల్లో జస్టిస్ ప్రసన్న మూడో దళిత న్యాయమూర్తి కానున్నారు.అత్యున్నత న్యాయస్థానంలో ఇప్పటికే జడ్జీలుగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు దళిత సామాజిక వర్గానికే చెందినవారన్న విషయం తెలిసిందే. మరోవైపు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఏకైక దళిత సీజే జస్టిస్ ప్రసన్ననే కావడం గమనార్హం. సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ ప్రసన్న.. అడ్వకేట్‌గా తన పేరును 1985లో నమోదు చేసుకున్నారు. 2008 జూలై 18న ఆయన బాంబే హైకోర్టు జడ్జిగా నియామకమయ్యారు. 2022 అక్టోబర్ 15న కర్ణాటక హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. జస్టిస్ వరాలే అభిశంసించలేని ప్రవర్తన, సమగ్రతతో సమర్థుడైన న్యాయమూర్తి అని తన తీర్మానంలో కొలీజియం అభివర్ణించింది. వృత్తిపరమైన నీతి, ఉన్నత ప్రమాణాలను కొనసాగిస్తూ వస్తున్నారని ప్రశంసించింది. కర్ణాటకలోని మైసూర్‌లో 1962లో జన్మించిన వరాలేకు ప్రస్తుతం 61ఏళ్లు. ఆయన నాలుగేళ్లపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగే అవకాశం ఉంది.


Advertisement

Next Story

Most Viewed