ఎన్డీయేకు ‘అగ్ని’పరీక్ష.. ఎందుకు ?

by Hajipasha |
ఎన్డీయేకు ‘అగ్ని’పరీక్ష.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీయే కూటమి సంకీర్ణ సర్కారు ఆదిలోనే ‘అగ్ని’పరీక్షను ఎదుర్కొంటోంది. కాంట్రాక్టు ప్రాతిపదికన సైనికుల నియామకానికి ఉద్దేశించి బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ స్కీం‌పై కూటమిలోని కీలక మిత్రపక్షాలు గళమెత్తాయి. అగ్నివీర్ స్కీం విధివిధానాలను బిహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ, చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్‌జేపీ తప్పుపట్టాయి. 2014, 2019 పాలనా కాలాల్లో బీజేపీ వైఖరిని ఎన్డీయే కూటమిలోని ఏ మిత్రపక్షం కూడా వ్యతిరేకించలేదు. కానీ ఈసారి బీజేపీకి సొంత మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో మీడియా సాాక్షిగా అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు ఎన్డీయే మిత్రపక్షాలు సిద్దమయ్యాయి. ఈక్రమంలోనే గురువారం రోజు జేడీయూ ప్రధాన అధికార ప్రతినిధి కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అగ్నివీర్ స్కీంపై దేశవ్యాప్తంగా చాలా వ్యతిరేకత ఉంది.. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దానిపై సమీక్ష చేయాలి’’ అని ఆయన కోరారు. ఆ స్కీంను తెచ్చిన కొత్తలోనే సైన్యంలోని వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయని త్యాగి గుర్తు చేశారు. ‘‘అగ్నివీర్ స్కీం ఎన్నికల్లోనూ ఎంతో ప్రభావం చూపించింది. దాన్ని కచ్చితంగా సమీక్షించాల్సిందే. దీనిపై ప్ర‌జ‌లు లేవనెత్తిన లోటుపాట్ల‌ను వివ‌రంగా చ‌ర్చించి చ‌క్క‌దిద్దాల‌ని మా పార్టీ కోరుకుంటోంది’’ అని ఆయన చెప్పారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు మద్దతు

‘‘ఉమ్మ‌డి పౌర‌స్మృతి (యూసీసీ)కి మేం వ్య‌తిరేకం కాదు. అది సంక్లిష్టమైన సబ్జెక్ట్. అయితే యూసీసీ వల్ల ప్ర‌భావిత‌మయ్యే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో చ‌ర్చించి ఓ పరిష్కారం అన్వేషించాలి’’ అని జేడీయూ అధికార ప్రతినిధి త్యాగి కోరారు. యూసీసీపై జేడీయూ పార్టీ జాతీయ అధ్య‌క్షుడి హోదాలో బిహార్ సీఎం నితీష్ కుమార్ లా క‌మిష‌న్ చీఫ్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికపై ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. ‘‘దేశంలోని ఏ పార్టీ కూడా కులగణనను వ్యతిరేకించలేదు. ఈ విషయంలో బిహార్ అన్ని రాష్ట్రాలకు మార్గం చూపించింది. ప్రధాని కూడా వ్యతిరేకించలేదు. కులగణన అవసరం. దాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం. బిహార్​కు ప్రత్యేక హోదా దక్కాలనేది మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటుంది’’ అని కేసీ త్యాగి వ్యాఖ్యానించారు.

యువత జీవితాలతో ముడిపడిన అంశం :చిరాగ్

అగ్నివీర్ స్కీంను తప్పకుండా సమీక్షించాలని ఎన్డీయే మిత్రపక్షం లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్) అగ్రనేత చిరాగ్ పాస్వాన్ డిమాండ్ చేశారు. యువత జీవితాలకు సంబంధించిన అగ్నివీర్ స్కీంలోని లోపాలను సరిదిద్దితే ఎంతోమందికి మంచి భవిష్యత్ లభిస్తుందన్నారు. అయితే దీనిపై ఇప్పుడే తొందరపాటుతో వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇలాంటి అంశాలపై కూర్చొని మాట్లాడుకోవచ్చన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చిరాగ్ డిమాండ్ చేశారు. అయితే ఆ సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ బహిర్గతం చేస్తే సమాజంలో కులపరమైన చీలికలు ఏర్పడతాయని పేర్కొన్నారు. కులగణన సమాచారం ఆధారంగా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రణాళికలు రూపొందించాలన్నారు. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం గత ఎన్డీయే హయాంలో రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన పథకమే ‘అగ్నివీర్’ స్కీం. దీని ద్వారా ఆర్మీలో చేరేవారు నాలుగేళ్లే ఆర్మీలో సేవలు అందించాలి.

Advertisement

Next Story

Most Viewed