Coimbatore : కోయంబత్తూరులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆఫీస్.. ఎందుకు ?

by Hajipasha |
Coimbatore : కోయంబత్తూరులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆఫీస్.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే వారిని ప్రోత్సహించేందుకు తమిళనాడులోని కోయంబత్తూరులో కార్యాలయాన్ని తెరుస్తామని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. ‘మధ్యప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలు’ అనే అంశంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురువారం కోయంబత్తూరులో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7,8 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ - గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ - 2025’లో పాల్గొనాలని తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలను సీఎం మోహన్ యాదవ్ కోరారు.

మంచి నేల, నీటి వసతి, పుష్కలంగా పత్తి సాగుకు మధ్యప్రదేశ్ నెలవు అని ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు ఆకర్షణీయమైన రాయితీలు అందిస్తామన్నారు. ‘పీఎం మిత్ర ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్‌టైల్ పార్క్’ కూడా రాష్ట్రానికి మంజూరైందని సీఎం తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజలకు స్కిల్స్ నేర్పే అంశంపై తమిళనాడులోని తిరుపూర్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని మోహన్ యాదవ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed