వైద్యులతో చర్చలకు సీఎం మమతా ఆఖరి యత్నం

by Y. Venkata Narasimha Reddy |
వైద్యులతో చర్చలకు సీఎం మమతా ఆఖరి యత్నం
X

దిశ వెబ్ డెస్క్ : ఆర్‌జీ కర్‌ ఆసుపత్రి ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన పట్ల గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న వైద్యులను బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే నాలుగుసార్లు వైద్యులను చర్చలకు ఆహ్వానించిన దీదీ ప్రభుత్వం చివరి ప్రయత్నంగా ఐదోసారి చర్చలకు ఆహ్వానం పంపింది. కోల్‌కతా కాళీఘాట్‌లోని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం 5 గంటలకు డాక్టర్లను సమావేశానికి ఆహ్వానించింది. ఈ మేరకు బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ వైద్యులకు లేఖ రాశారు. ఇదే చివరి ఆహ్వానం అని బేషరతుగా చర్చలు జరిపేందుకు రావాలని లేఖలో కోరారు. జూనియర్ వైద్యులు ప్రధానంగా ఐదు డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవల కోసం తమ పని పరిస్థితులను మెరుగుపర్చాలని, ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర భద్రతను పెంచాలని, హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని, ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైద్యులతో ఇప్పటికే నాలుగు పర్యాయాలు చర్చలకు మమతా ప్రభుత్వం షరతులతో కూడిన ఆహ్వానం పంపగా వైద్యులు నిరాకరించారు. 15 మంది వైద్యుల ప్రతినిధి బృందంతో చర్చలకు రావాలని సర్కార్ ఆహ్వానించింది. వైద్యులతో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. వైద్యులు పెట్టిన డిమాండ్లను బెంగాల్‌ ప్రభుత్వం తిరస్కరించడంతో వైద్యులు చర్చలకు రావడానికి తిరస్కరించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సీఎం మమతా బెనర్జీ ప్రజల కోసం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చర్చలకు ఐదోసారి ఆఖరి ప్రయత్నంగా సీఎం మమతా పంపిన ఆహ్వానం పట్ల వైద్యుల స్పందన ఏ విధంగా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed