Supriya Sule: 'సీఎం మమతా త్వరగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం': సుప్రియా సూలే

by S Gopi |
Supriya Sule: సీఎం మమతా త్వరగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం: సుప్రియా సూలే
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి, హత్యను ఖండిస్తూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరితగతిన చర్యలు తీసుకుంటారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే మంగళవారం అన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తారని నమ్ముతున్నట్టు చెప్పారు. 'దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. వాటన్నింటినీ మేము ఖండిస్తున్నాము. మమతా బెనర్జీ త్వరగా చర్యలు తీసుకుంటారని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కుటుంబానికి న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాము. ఈ సంఘటన నుంచి మన బిడ్డను రక్షించలేకపోయాము. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకూడదు' అని సుప్రియా సూలే అన్నారు. మరోవైపు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సుధాన్షు త్రివేది దీదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కోల్‌కతా ఘటనలో నేరస్థులకు రక్షణ కల్పించిన విధానం సంఘటన కంటే చాలా విషాదకరమని అన్నారు. 24 గంటల్లోనే (ఆర్‌జీ కార్) ప్రిన్సిపాల్‌ని మరో కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమించడం బెంగాల్ ప్రభుత్వం నిందిస్తులను ఎలా రక్షిస్తుందో తెలియజేస్తోంది. ఇది బెంగాల్ ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై అనుమానాలు రేకెత్తిస్తోంది' అని త్రివేది విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి సదరు ప్రిన్సిపాల్‌పై ఎందుకు సానుభూతి ఉందని ప్రశ్నించారు.

Advertisement

Next Story