ఢిల్లీని ప్రపంచ విద్యా కేంద్రంగా చేయడమే నా లక్ష్యం.. సీఎం కేజ్రీవాల్

by Javid Pasha |
ఢిల్లీని ప్రపంచ విద్యా కేంద్రంగా చేయడమే నా లక్ష్యం.. సీఎం కేజ్రీవాల్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీని ప్రపంచ విద్యా కేంద్రంగా చేయడమే తన లక్ష్యమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్’ పేరుతో జరిగిన కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన పలువురి విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించి అవార్డులు అందజేశారు. అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా 2015లో ఈ అవార్డులను ప్రారంభించామని, ప్రస్తుతం ఈ అవార్డులను సాధించడం గొప్ప విజయంగా భావిస్తున్నారని చెప్పారు.

ఎక్సలెన్స్ అవార్డులు అందుకుంటున్నప్పుడు విద్యార్థుల ముఖాల్లో విశ్వాసాన్ని, సంతోషాన్ని చూశానని పేర్కొన్నారు. అవార్డు రానివాళ్లు ఎలాంటి నిరాశకు గురి కావొద్దని, వచ్చే ఏడాది అవార్డులు పొందేలా కృషి చేయాలని కేజ్రీవాల్ సూచించారు. గత ఏడేనిమిదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల మధ్య అంతరం బాగా తగ్గిందని, ప్రస్తుతం ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన నడుస్తోందని సీఎం తెలిపారు. ఢిల్లీలో విద్యాభివృద్ధికి ఎక్సలెన్స్ అవార్డులు అందుకు ఎంతో దోహదం చేశాయని అన్నారు.

విద్యా ప్రమాణాలను పెంచడంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల టీచర్లు, ప్రిన్సిపాళ్లు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఢిల్లీ మున్సిసల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 1800 పాఠశాలలు ఉన్నాయని, విద్యా, వసతుల పరంగా ఈ స్కూళ్లన్నీ సవాళ్లు ఎదుర్కొంటున్నాయని, కానీ భవిష్యత్తులో ఈ సవాళ్లనన్నింటినీ అధిగమిస్తామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా మొన్నటి వరకు ఢిల్లీ విద్యా శాఖ మంత్రిగా మనీశ్ సిసోడియా ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆయన ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed