China : జనసమూహంపైకి దూసుకెళ్లిన కారు.. 35 మంది దుర్మరణం

by Sathputhe Rajesh |
China : జనసమూహంపైకి దూసుకెళ్లిన కారు.. 35 మంది దుర్మరణం
X

దిశ, నేషనల్ బ్యూరో : జనసమూహంపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 35 మంది మృతి చెందారు. మరో 43 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన దక్షిణ చైనాలోని జుహాయి వద్ద స్పోర్ట్స్ సెంటర్ ప్రాంగణంలో చోటు చేసుకుంది. కారును నడిపిన 62 ఏళ్ల వ్యక్తిని పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో హిట్ అండ్ రన్ దృశ్యాలు నమోదయ్యాయి. ఘటన జరిగిన తర్వాత చాలా మంది చెల్లాచెదురై పడి కనిపించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకోగా పలువురు కారు నడిపిన వ్యక్తిని ‘టెర్రరిస్ట్’ అంటూ పిలవడం వినిపించింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని ఇంటిపేరును ఫాన్‌గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు తీవ్రగాయాల కారణంగా కోమాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.48 గంటలకు ఎస్‌యూవీ కారును పాదచారులపైకి ఉద్దేశపూర్వకంగా నడిపినట్లు తెలిసింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆస్తి విషయంలో తగాదాల కారణంగా ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనను దుర్మార్గపు చర్యగా పోలీసులు అభివర్ణించారు. జుహాయిలోని మేజర్ ఎయిర్ షోకి ముందు రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఈ వారంలో చైనాలోనే అతిపెద్ద ఎయిర్ షోకు జుహాయి ఆతిథ్యం వహిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed