పెళ్లికాక‌ముందే కుమార్తె పేరెంట్స్ నుండి పెళ్లిఖ‌ర్చులు తీసుకోవ‌చ్చుః కోర్టు కీల‌క తీర్పు

by Sumithra |   ( Updated:2022-03-31 09:38:35.0  )
పెళ్లికాక‌ముందే కుమార్తె పేరెంట్స్ నుండి పెళ్లిఖ‌ర్చులు తీసుకోవ‌చ్చుః కోర్టు కీల‌క తీర్పు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'పెళ్లి చేసినా, ఇల్లు క‌ట్టినా ఆ కుటుంబం కొన్నేళ్ల వ‌ర‌కూ కోలుకోలేర‌ని' ఓ నానుడి ఇండియాలో చాలా ఫేమ‌స్‌. అందుకే, ఆడ బిడ్డ పుట్టిన‌ప్పటి నుంచే ఆమె పెళ్లి ఖ‌ర్చులపై ఇంట్లో గోల ఉంటూనే ఉంటుంది. అయితే, ఓ మ‌హిళ ఈ గోల తోనే కోర్టు మెట్లు ఎక్కింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 35 ఏళ్ల మహిళ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను బిలాస్‌పూర్‌లోని హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, 1956 నిబంధనల ప్రకారం పెళ్లికాని కూతురు తన పెళ్లి ఖ‌ర్చుల‌ను తల్లిదండ్రుల నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చని జస్టిస్ గౌతమ్ భాదురి, సంజయ్ ఎస్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. వివ‌రాల్లోకి వెళితే...

భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి భును రామ్ కుమార్తె (పిటిషనర్) హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం, 1956 ప్రకారం దుర్గ్ ఫ్యామిలీ కోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. త‌న పెళ్లి ఖ‌ర్చుల మొత్తం కింద‌ రూ. 25 లక్షల ఇవ్వాలని ఆమె ఈ దావాలో పేర్కొన్నారు. రాజేశ్వరి తన పిటిషన్‌లో, ప్రతివాది అయిన భాను రామ్ (తండ్రి) పదవీ విరమణ చేయబోతున్నారని, పదవీ విరమణ బకాయిలుగా రూ. 75 లక్షలు అందుకోవచ్చని, అందువల్ల ఆయ‌న‌ రిటైర్ బకాయిల్లో కొంత భాగాన్ని, అంటే రూ. 25 ల‌క్ష‌లు విడుదల చేయాలని, ప్రతివాది- య‌జ‌మాని అయిన భిలాయ్ స్టీల్ ప్లాంట్‌ను ఆదేశిస్తూ తగిన రిట్ జారీ చేయాలని కోరింది. అయితే, కుమార్తె తన వివాహం మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని చట్టంలో ఎటువంటి నిబంధన లేదని పేర్కొంటూ స‌ద‌రు దరఖాస్తును ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది.

కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను సవాలు చేస్తూ, రాజేశ్వరి హైకోర్టును ఆశ్రయించగా, చట్టం ప్రకారం, పెళ్లికాని కుమార్తె తన తండ్రి నుండి వివాహ ఖర్చులను డిమాండ్ చేయవచ్చని పేర్కొంటూ, ఆ ఖర్చు భరణం పరిధిలోకి వస్తుందని ఛ‌త్తీస్‌గఢ్ హైకోర్టు కీల‌క‌ తీర్పు వెలువ‌రించింది. "భారత సమాజంలో, సాధారణంగా వివాహానికి ముందు, వివాహ సమయంలో కూడా ఖర్చులు చేయాల్సి ఉంటుంది" అని ధ‌ర్మాస‌నం తెలిపింది. ఇప్ప‌టికే సృష్టించ‌బ‌డిన అలాంటి హక్కులను క్లెయిమ్ చేసినప్పుడు కోర్టులు "తిరస్కరణ" చేయ‌లేవ‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కుటుంబ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దుర్గ్ జారీ చేసిన 22 ఏప్రిల్ 2016 నాటి ఉత్తర్వును బెంచ్ కొట్టివేసింది. 1956 చట్టంలోని సెక్షన్ 3(బి) (ii) స్ఫూర్తితో మెరిట్‌లపై తీర్పు కోసం కుటుంబ న్యాయస్థానానికి ఈ విషయాన్ని రిమాండ్ చేసింది. మెరిట్‌లపై తీర్పు కోసం కుటుంబ న్యాయస్థానం ముందు ఏప్రిల్ 25న హాజరు కావాలని పార్టీలను ఆదేశించింది. తొలిసారి ఈ త‌ర‌హా ఉత్త‌ర్వులు జారీ చేసిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పుతో చ‌ట్టంలో మ‌రో విశేషం లిఖించ‌బ‌డింద‌ని పిటీష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది తివారి అన్నారు.


మూడేళ్లుగా నమ్మించి మోసం చేశాడు.. న్యాయం కావాలంటున్న నటి

Advertisement

Next Story

Most Viewed