Chandrayaan-3 : చంద్రుడికి 177 కి.మీ. దూరంలో చంద్రయాన్-3

by Harish |   ( Updated:2023-08-16 14:13:18.0  )
Chandrayaan-3 : చంద్రుడికి 177 కి.మీ. దూరంలో చంద్రయాన్-3
X

బెంగళూరు: చంద్రుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ కక్ష్యను బుధవారం (ఆగస్టు 16న) ఉదయం 8.30 గంటలకు మరోసారి సక్సెస్ ఫుల్‌గా తగ్గించారు. దీంతో స్పేస్ క్రాఫ్ట్ కక్ష్య తగ్గింపు దశలన్నీ ముగిశాయని.. చంద్రుడి చుట్టూ స్పేస్ క్రాఫ్ట్ తిరిగేందుకు సంబంధించిన చివరి కక్ష్య ఇదేనని ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలానికి 177 కిలోమీటర్ల దూరంలో తిరుగుతోందని వివరించారు.

గురువారం (ఆగస్టు 17న) ఉదయం ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ విడిపోయే ప్రాసెస్ చేపడతామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే సమయానికి.. చంద్రుడికి దాదాపు 100 కి.మీ దూరంలో చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ ఉంటుందన్నారు.

శుక్రవారం రోజు (ఆగష్టు 18న) చివరిసారిగా చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ కక్ష్యను తగ్గించినప్పుడు .. చంద్రుడి ఉపరితలం, చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ మధ్య దూరం కేవలం 30 కి.మీ మాత్రమే ఉంటుందని తెలిపారు. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోయిన తర్వాత ల్యాండర్ మాడ్యుల్ (ల్యాండర్, రోవర్) సొంతంగా చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతూ క్రమంగా చంద్రుడిపైకి దిగుతుందని పేర్కొన్నారు. అంతా సాఫీగా జరిగితే ఈ నెల 23న ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మాడ్యుల్ అడుగు పెడుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed