Champai Soren: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేఎంఎంకు షాక్

by Shamantha N |   ( Updated:2024-08-18 11:41:59.0  )
Champai Soren: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేఎంఎంకు షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) పార్టీకి షాక్ తగలనున్నట్లు వార్తలొస్తున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాల మధ్య చంపై సోరెన్ ఢిల్లీకి వెళ్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంపై సోరెన్ సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల గురించి పుకార్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో చంపై సోరెన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో ఈ ఊహాగానాలపై స్పష్టత రానుంది. అయితే, బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను చంపై సోరెన్ తొసిపుచ్చారు. ఊహాగానాలు రిపోర్టుల గురించి తనకేమీ తెలియది.. ఎక్కడున్నానో అక్కడే ఉంటానని స్పష్టం చేశారు. తాను ఢిల్లీలో ఎవర్నీ కలవలేదని తెలిపారు. వ్యక్తిగత పనితో పాటు పిల్లలను కలిసేందుకు ఢిల్లీ వచ్చానని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో జేఎంఎం పేరు మాయం

చంపై సోరెన్ శనివారం కోల్ కతాలో బీజేపీ నేత సువేందు అధికారితో భేటీ అయ్యారు. అప్పట్నుంచే ఆయన బీజేపీలో చేరతారని ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఆయన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ నుంచి జేఎంఎం పేరుని తొలగించారు. దీంతో, ఆయనపార్టీ మారడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఆయన ఏ క్షణమైనా కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎలాంటి సమాచారం లేదన్న బీజేపీ నాయకులు

ఇటీవలే జార్ఖండ్ లోని బీజేపీ నేతలతో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ సమావేశం నిర్వహించారు. అయితే, చంపై సోరెన్ బీజేపీలో చేరుతారనే అధికారిక సమాచారం లేదని అన్నారు. ”చంపై సోరెన్ చాలా సీనియర్ నాయకుడు. నేను అతని గురించి అనధికారికంగా ఎటువంటి వ్యాఖ్య చేయదలుచుకోలేదు" అని అతను చెప్పాడు. జార్ఖండ్ బీజేపీ ఎంపీ దీపక్ ప్రకాష్ కుడా తన వద్ద ఎలాంటి ప్రామాణికమైన సమాచారం లేదన్నారు. హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైప్రొఫైల్ మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా ఆయన కొంతకాలం పనిచేశారు. హేమంత్ సోరెన్ బెయిల్ పై బయటకు రావడంతో జూలైలో సీఎం పదవికి చంపై రాజీనామా చేశారు.

Advertisement

Next Story

Most Viewed