‘శ‌క్తి’ని కాపాడుకునేందుకు నా ప్రాణాల‌ను అడ్డువేస్తా: ప్రధాని మోడీ

by Hajipasha |   ( Updated:2024-03-18 11:26:40.0  )
‘శ‌క్తి’ని కాపాడుకునేందుకు నా ప్రాణాల‌ను అడ్డువేస్తా: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ‘శ‌క్తి’ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధానమంత్రి నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. భార‌త గడ్డపై ఎవ‌రైనా ‘శ‌క్తి’ వినాశ‌నాన్ని కోరుతారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌నం అంద‌రం శ‌క్తిని ఆరాధిస్తామా లేదా అని ఆయ‌న తెలంగాణలోని జగిత్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభకు హాజరైన ప్రజలను మోడీ అడిగారు. యావ‌త్ భారతావని శ‌క్తిమాత‌ను ఆరాధిస్తుంద‌ని తెలిపారు. చంద్రుడిపై చంద్ర‌యాన్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి కూడా ‘శివశక్తి’ అని పేరు పెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ త‌న మేనిఫెస్టోలో ‘శ‌క్తి’ నాశ‌నాన్ని కోరుకున్న‌ద‌ని, ఆ స‌వాల్‌ను తాను స్వీక‌రిస్తున్నాన‌ని ప్రధాని చెప్పారు. శ‌క్తిని కాపాడుకునేందుకు త‌న ప్రాణాల‌ను కూడా అడ్డువేస్తాన‌ని మోడీ తెలిపారు. ఈ పోరాటం శ‌క్తిని ఆరాధించేవారికి, శ‌క్తిని నాశ‌నం చేయాల‌నుకునే వారికి మ‌ధ్య జరుగుతోందన్నారు. జూన్ 4న ఈ పోరాటం ముగుస్తుంద‌ని మోడీ పేర్కొన్నారు. ‘‘నాకు ప్ర‌తి త‌ల్లి, కూతురు, సోద‌రి శ‌క్తి రూప‌మే. భార‌త మాత‌ను ఆరాధిస్తున్న‌ట్లుగా.. వారంద‌ర్నీ నేను శ‌క్తిగా ఆరాధిస్తాను’’ అని ప్ర‌ధాని చెప్పారు.

రాహుల్ అసలేమన్నారు ?

ముంబైలో ఆదివారం జరిగిన ‘భారత్ జోడో న్యాయయాత్ర’ ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘మోడీపై నా పోరాటం వ్యక్తిగతం కాదు. శక్తి(అధికారం)కి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. ఇక్కడ శక్తి అంటే ఏమిటనే ప్రశ్న ఉంది. రాజు (మోడీ) ఆత్మ ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఆదాయం పన్ను సంస్థల్లో ఉంది. అవి లేకుండా ఆయన గెలవలేరు. అవే ఆయన(మోడీ) శక్తి. అందుకే శక్తిపైనే మా పోరాటం’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘శక్తి’ అనే పదాన్ని అధికార దాహం అనే కోణంలో ఈ వ్యాఖ్యల్లో రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.


Advertisement

Next Story