- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు ‘సీఏఏ’ అమల్లోకి.. పౌరసత్వానికి గైడ్‌లైన్స్ ఇవీ
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కారు చెప్పినంత పని చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఏఏను అమల్లోకి తెస్తామని చెప్పినట్టే చేసి చూపించింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను సోమవారం సాయంత్రం నుంచే అమల్లోకి తెచ్చింది. సీఏఏ అమలుకు సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు, మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో 2019 సంవత్సరంలోనే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదాన్ని పొంది చట్టంగా మారిన సీఏఏ.. నాలుగేళ్ల తర్వాత అమల్లోకి వచ్చినట్లయింది.
ఈ మూడు దేశాల నుంచి..
పార్లమెంట్ నిబంధనల ప్రకారం.. ఓ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆరు నెలల లోపు విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది. అలా కుదరకుంటే గడువును పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభలోని కమిటీల అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో 2020 నుంచి తరుచుగా గడువు పెంపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని తీసుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 11న దాని అమలుపై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. ఫలితంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే అలాంటి వారందరికీ భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి.
అప్లికేషన్ ప్రాసెస్ ఇదీ..
సీఏఏ-2019 రూల్స్‌లో భాగంగా పౌరసత్వాన్ని పొందాలని భావించే వారు నమోదు చేసుకోవడానికి ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి అడుగుపెట్టిన ఆయా వర్గాల వారు.. దేశంలోకి ప్రవేశించిన ఏడాది, వ్యక్తిగత వివరాలు, చిరునామాను ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో నింపితే సరిపోతుంది. దరఖాస్తుదారులు మరే పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు. పౌరసత్వం కేటాయింపునకు సంబంధించిన ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఇక సీఏఏ ద్వారా పౌరసత్వం మంజూరుకు ప్రతీ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక సాధికార కమిటీని నియమిస్తారు. సెన్సస్ ఆపరేషన్ విభాగం డైరెక్టర్ సారథ్యం వహించే ఈ కమిటీలో మరో ఏడుగురు సభ్యులు కూడా ఉంటారు. వీరంతా కలిసి ఆన్‌లైన్ అప్లికేషన్లను పరిశీలించి, పౌరసత్వ మంజూరుపై తుది నిర్ణయం తీసుకుంటారు.
భద్రత కట్టుదిట్టం..
సీఏఏ నిబంధనల్ని కేంద్రం నోటిఫై చేయడంతో ఢిల్లీలోని షాహీన్‌బాగ్, జామియా వంటి సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అసోం, బెంగాల్, మిజోరం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోనూ భారీగా పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఆందోళనల్లో 2020లో ఢిల్లీలో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సీఏఏ ఆమోదం పొందిన వేళ 2019 సంవత్సరంలో విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలైన అసోం, త్రిపురల్లోనూ ఆందోళనలు వెల్లువెత్తాయి. సీఏఏ బిల్లు మనదేశంలోకి బంగ్లాదేశ్ వలసదారుల ప్రవాహాన్ని చట్టబద్ధం చేస్తుందనే ఆందోళన అసోం, బెంగాల్, మిజోరం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని హిందూ సంఘాల్లో వ్యక్తమైంది. తమ పౌరసత్వంపై ప్రశ్నలు ఉదయిస్తాయేమోనన్న ఆందోళన అప్పట్లో ముస్లిం వర్గాల్లో వ్యక్తమైంది. అలాంటిదేమీ లేదని.. భారత్‌లోకి వలస వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వడమొకటే తమ ఉద్దేశమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నాటి నుంచి నేటివరకు చాలా సందర్భాల్లో వివరణ ఇచ్చారు.
ఓ వైపు హర్షం.. మరోవైపు ఆగ్రహం
పౌరసత్వ సవరణ చట్టం అమలును కేంద్ర సర్కారు నోటిఫై చేయడంతో సోమవారం రాత్రి ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలోని పాకిస్తాన్ శరణార్థులు సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా జోధ్‌పూర్‌లో నివసిస్తున్న పాకిస్తానీ శరణార్ధులు కూడా ఈసందర్భంగా వేడుకలు జరుపుకున్నారు. మరోవైపు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్‌లో విద్యార్థులు నిరసనకు దిగారు. సీఏఏ వల్ల మైనారిటీలకు హక్కులకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసోం రాష్ట్రంలో కూడా పలు చోట్ల నిరసనలు జరిగాయి.
సీఏఏను మా రాష్ట్రంలో అమలు చేయం : కేరళ సీఎం
సీఏఏను దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టంగా కేరళ సీఎం పినరయి విజయన్ అభివర్ణించారు. కేరళలో దీన్ని అమలుచేయబోమని ఆయన స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో అమలు చేయబోమని ఇప్పటికే తమ ప్రభుత్వం పదేపదే చెప్పిందని గుర్తు చేశారు. ఆ మాటపై నిలబడి ఉంటామని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యావత్ కేరళ ఏకతాటిపై నిలబడాలని కోరారు. కాగా, కేంద్రం నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ) పేర్కొంది.
ఈ నిర్ణయం దేశానికి వ్యతిరేకం : కేజ్రీవాల్
‘‘కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశానికి వ్యతిరేకమైనది.. దీనిపై ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో స్పందిస్తారు’’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల బాండ్ల అంశం నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శరద్ పవార్ అన్నారు. సీఏఏ అమలు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. అధికార బీజేపీ ప్రతి అంశాన్నీ హిందువులు, ముస్లింల మధ్య విభజన కోసమే తీసుకొస్తోందని ఆరోపించారు. జీవనోపాధి కోసం మన పౌరులే విదేశీబాట పడుతుంటే ఇతరుల కోసం పౌరసత్వ చట్టం తీసుకురావడం వల్ల ఏం లాభం వస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. గత పదేళ్లలో లక్షలాది మంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు.