ఆరేళ్లు నిండాకే 1వ తరగతిలో అడ్మిషన్

by S Gopi |
ఆరేళ్లు నిండాకే 1వ తరగతిలో అడ్మిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: స్కూళ్లలో పిల్లలను చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్లు నిండిన చిన్నారులకే ఒకటవ తరగతిలో అడ్మిషన్‌లు ఇవ్వాలని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. నూతన విద్యా విధానంలో భాగంగా పిల్లలకు ఒకటవ తరగతి అడ్మిషన్లపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కీలక సూచనల గురించి లేఖ పంపింది. ఆరేళ్లు నిండిన తర్వాతే 1వ తరగతి అడ్మిషన్ ఇవ్వాలని, ఇది వచ్చే 2024-25 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్ఈపీ) 2020, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 2009లోని నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా 3 ఏళ్లు ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత రెండేళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ 1,2వ తరగతులు ఉంటాయి. ప్రీ-స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులేని అభ్యాస పద్ధతిని ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతో ఈ విధానం అమలు చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రీ-స్కూల్ నుంచి రెండో తరగతి వరకు చిన్నారుల్లో నేర్చుకునే ప్రక్రియ అలవడుతుంది. అదేవిధంగా అంగన్‌వాడీ, ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు, ఎన్‌జీవో సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ప్రీ-స్కూళ్లలోని చిన్నారులకు ఒకటవ తరగతిలో చేరడానికి ముందే నాణ్యమైన విద్య అందుతుందని కేంద్రం అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed