కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వం కుట్ర..ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఫైర్

by vinod kumar |
కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వం కుట్ర..ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో భాగంగా తిహార్ జైలులో కేజ్రీవాల్‌ను మంగళవారం విచారించిన సీబీఐ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు పేర్కొన్నాయి. బుధవారం ఆయనను ట్రయల్ కోర్టులో హాజరుపరిచేందుకు అనుమతి కూడా తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత కేజ్రీవాల్ ను కస్టడీకి కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇదే కేసులో ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు అంతకుముందు నిరాకరించింది. ఈ తీర్పుపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ను సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేసి వాంగ్మూలాన్ని నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అత్యున్నత న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ విచారణకు ముందే కేజ్రీవాల్ ను ట్రయల్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలుస్తోంది.

అయితే అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్‌పై సీబీఐ తప్పుడు కేసు పెట్టిందని మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉందని, అందుకే తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఫైర్ అయ్యారు. బీజేపీ చేస్తున్న దౌర్జన్యాలు, అన్యాయాలను యావత్ దేశం చూస్తోందని తెలిపారు. కాగా, మద్యం పాలసీ కేసులో ఈడీ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు.

Advertisement

Next Story