హైదరాబాద్ విమానాశ్రయంలోని ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు

by S Gopi |   ( Updated:2024-06-30 15:08:53.0  )
హైదరాబాద్ విమానాశ్రయంలోని ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో ఇద్దరు మాజీ సూపరింటెండెంట్‌లు, ఒక కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ముగ్గురు వ్యక్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. జూన్ 28న నమోదైన ఈ కేసులో కుట్ర, అవినీతి ఆరోపణలున్నాయి. నిందితులు యెరుకుల శ్రీనివాసులు(అప్పటి కస్టమ్స్ సూపరింటెండెంట్), పంకజ్ గౌతమ్ (కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్), పేరి చక్రపాణి (కస్టమ్స్ సూపరింటెండెంట్) అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి విదేశీ కరెన్సీలను పొందేందుకు కుట్ర పన్నారు. ఈ ఏడాది మార్చి 16న ఆర్‌జీఐఏ వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) భారతీయ కరెన్సీ రూ. 2,93,425కి సమానమైన విదేశీ కరెన్సీని మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అడ్డగించింది. అలాగే హైదరాబాద్‌లోని బహదూర్‌పురా నివాసితులైన ఇద్దరు వ్యక్తులు రూ.4,04,380 భారత కరెన్సీని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కస్టమ్స్ అధికారులు విదేశీయులకు కస్టమ్స్ సుంకాలు విధించకుండా విదేశీ కరెన్సీలను ఇచ్చారని అధికారులు ఆరోపించారు. ఇదే తరహా ప్రక్రియ తరచుగా జరుగుతున్నట్టు సందేహాలున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో మూడు, ఢిల్లీలో ఒకటి సహా నాలుగు చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి, నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకుంది. విచారణ కొనసాగుతోందని సీబీఐ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed