పెట్టుబడి పేరుతో మోసం.. 10 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు

by S Gopi |
పెట్టుబడి పేరుతో మోసం.. 10 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: యాప్ ద్వారా మోసపూరిత పెట్టుబడి స్కీమ్‌లకు సంబంధించి దర్యాప్తులో భాగంగా సీబీఐ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. హెచ్‌పీజెడ్ టొకెన్ యాప్ పెట్టుబడి పథకంతో మోసాలకు పాల్పడుతున్న కేసులో సీబీఐ దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 10 రాష్ట్రాల్లోని 30 చోట్ల సోదాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, జోధ్‌పూర్, ముంబై, బెంగళూరు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లోని ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. హెచ్‌పీజెడ్ టొకెన్ యాప్ మోసంలో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో లిలియన్ టెక్నోక్యాబ్, షిగూ టెక్నాలజీ కంపెనీలు, ఆయా కంపెనీల డైరెక్టర్లపై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ రెండు కంపెనీలు బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ వంటి వాటిలో పెట్టుబడుల ద్వారా భారీగా లాభాలు వస్తాయని వినియోగదారులను నమ్మిస్తున్నాయి. తాజా దాడుల్లో నేరారోపణ పత్రాలు, డిజిటల్ ఆధారాలు సీజ్ చేశారు. అలాగే, మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లు, సిమ్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, ఈ-మెయిల్ అకౌంట్ వివరాలు, వివిధ డాక్యుమెంట్లు సహా ముఖ్యమైన డిజిటల్ సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెట్టుబడిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు నిందితులు సుమారు 150 బ్యాంకు ఖాతాలను వాడినట్టు సీబీఐ గుర్తించింది.

Advertisement

Next Story