గాలి జనార్ధన్ రెడ్డిని బళ్లారిలో అడుగుపెట్టనివ్వొద్దు!

by GSrikanth |
గాలి జనార్ధన్ రెడ్డిని బళ్లారిలో అడుగుపెట్టనివ్వొద్దు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులు రోజు వారీ విచారించేలా సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తన బెయల్ షరతులు సడలించి బళ్లారి వెళ్లేందుకు అనుమతించాలని గాలి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్‌ కూడా ఆ వ్యవహారాన్ని రోజు వారీగా కొనసాగించాలని ఆదేశిస్తామని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం పేర్కొంది. సాక్షుల్లో ఎవరిని ముందు విచారించాలో మెజిస్ట్రేట్‌ నిర్ణయిస్తుందని, ఆ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వదని ధర్మాసనం స్పష్టం చేసింది. సొంత ప్రదేశాన్ని వీడి ఇప్పటికే 15 సంవత్సరాలు దాటిపోయిందని బళ్లారిలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి తరపు న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేయగా గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ షరతులు సడలించవద్దని సీబీఐ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ కోర్టును అభ్యర్థించారు. ఆయనకు ఇచ్చిన బెయిల్ ఆసరాగా సాక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

గాలి జనార్ధన్ రెడ్డి కూతురు ప్రసవించిందని, తన మనవరాలిని చూసేందుకు కుటుంబంతో గడిపేందుకు గాలికి 2 నెలలు బళ్లారికి వెళ్లేలా సమయం ఇవ్వాలని మీనాక్షి అరోరా విజ్ఞప్తి చేయగా దీనిపై సీపీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గాలి జనార్ధన్‌రెడ్డి కూతురు బెంగళూరులో ప్రసవించిందని, గురువారం సాయంత్రం కోర్టు విచారణ ముగిసిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్‌ అయ్యారని కోర్టుకు సీబీఐ నివేదించింది. నిన్న సాయంత్రం సుమారు ఏడు గంటలు రోడ్డు మార్గంలో ప్రయాణించి.. రాత్రి గాలి జనార్ధన్‌రెడ్డి కూతురు, పుట్టిన పాపతో కలిసి బళ్లారికి చేరుకున్నారని సీబీఐ తెలిపింది. బెంగళూరు ఆసుపత్రిలో ప్రసవించిన విషయాన్ని గోప్యంగా ఉంచి కోర్టును గాలి జనార్ధన్ రెడ్డి తప్పుదారి పట్టించారని సీబీఐ పేర్కొంది. ప్రస్తుతం మైనింగ్ కుంభకోణం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అలాంటి కేసులో జనార్దన్ రెడ్డిని బళ్లారిలో అడుగుపెట్టనివ్వరాదని కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో బెయిల్‌ షరతులు సడలించాలని గాలి జనార్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం రిజర్వ్‌ చేసింది.

Advertisement

Next Story