గుజరాత్‌ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్తకు బెయిల్..

by Vinod kumar |
గుజరాత్‌ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్తకు బెయిల్..
X

న్యూఢిల్లీ : 2002 గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆమెకు బెయిల్‌ ఇచ్చేటందుకు నిరాకరిస్తూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. హైకోర్టు నిర్ణయం హేతబద్ధంగా లేదని కోర్టు అభిప్రాయపడింది. ‘హైకోర్టు తీర్పును రద్దుచేస్తున్నామని తెలిపింది. అరెస్ట్‌ నుంచి సెతల్వాద్‌‌కు కల్పించిన రక్షణను పొడిగిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. సాక్ష్యులను ప్రభావితం చేసేందుకు సెతల్వాద్‌ ప్రయత్నించరాదని కోర్టు ఆదేశించింది.

ఈ విచారణ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసిన సమయం, అరెస్ట్‌ వెనుక ఉద్దేశంపై ప్రశ్నలను లేవనెత్తింది. "2022 వరకు మీరు ఏం చేస్తున్నారు?" అంటూ పోలీసులను ప్రశ్నించింది. గుజరాత్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, నాటి ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేసేందుకు గోద్రా అల్లర్ల బాధితులతో కలిసి సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారన్న ఆరోపణలపై తీస్తా సెతల్వాద్‌ను గత ఏడాది జూన్‌లో గుజరాత్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed