'యాదవులు, ముస్లింల కోసం పని చేయను' అన్న వ్యాఖ్యలపై ఎంపీపై కేసు నమోదు

by Harish |
యాదవులు, ముస్లింల కోసం పని చేయను అన్న వ్యాఖ్యలపై ఎంపీపై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయనందుకు ముస్లిం, యాదవ వర్గాల కోసం తాను పని చేయనని జనతాదళ్(యునైటెడ్) లోక్‌సభ సభ్యుడు దేవేష్ చంద్ర ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై గురువారం కేసు నమోదైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సన్నిహితుడు అయిన ఠాకూర్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీతామర్హి నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు, ఆయన ఆర్జేడీకి చెందిన అర్జున్ రాయ్‌పై 51,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితం వచ్చిన కొన్ని రోజుల తర్వాత, ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, యాదవులు, ముస్లింలకు తాను సహాయం చేశానని కానీ ఈ రెండు వర్గాల వారు తనకు ఓటు వేయలేదని ఆరోపించారు, దీనికి బదులుగా వారి కోసం తాను పని చేయనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కుష్వాహా సంఘంపై కూడా విమర్శలు చేశారు. దీంతో ఆయన చేసిన ప్రకటనలపై ప్రత్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నుండి మాత్రమే కాకుండా ఆయన సొంత పార్టీ నుండి కూడా విమర్శలు అందుకున్నారు. ఈ వ్యాఖ్యలపై దిలీప్ కుమార్ కుష్వాహ అనే సామాజిక కార్యకర్త గురువారం ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టులో కేసును దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ తేదీని జులై 2గా నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed