మోడీ హామీలను నమ్మలేము: బీజేపీ మేనిఫెస్టోపై ఖర్గే విమర్శలు

by samatah |
మోడీ హామీలను నమ్మలేము: బీజేపీ మేనిఫెస్టోపై ఖర్గే విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ మండిపడ్డారు. మోడీ మేనిఫెస్టోను నమ్మలేమని ఎందుకంటే గత పదేళ్లలో పేదల కోసం ప్రధాని ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రస్తుత మేనిఫెస్టోలో ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. అలాగే ఎంఎస్పీని పెంచుతానని, చట్టపరమైన హామీ ఇస్తానని వెల్లడించారు. కానీ గత పదేళ్లలో దేశంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే అలాంటి పని ఒక్కటి కూడా చేయలేదు’ అని వ్యాఖ్యానించారు. తమ హామీలు నెరవేర్చారని రైతులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపినా పట్టించుకోలేదన్నారు. కాబట్టి ఆ మేనిఫెస్టోను నమ్మకం సరికాదని తెలిపారు. ప్రజలకు అందేది ఏదీ లేదని మరోసారి రుజువైందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నా మోడీ యువతకు భరోసా ఇస్తాననడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ద్రవ్యోల్బనం విపరీతంగా పెరుగుతున్నా దానిని నియంత్రించేందుకు మోడీ ఎటువంటి చర్యలూ చేపట్టలేదన్నారు. బీజేపీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story