'చీమను చంపేందుకు సుత్తి వాడుతారా?'.. ‘ఐటీ’ సవరణలపై కేంద్రాన్ని ప్రశ్నించిన బాంబే హైకోర్టు

by Vinod kumar |
చీమను చంపేందుకు సుత్తి వాడుతారా?.. ‘ఐటీ’ సవరణలపై కేంద్రాన్ని ప్రశ్నించిన బాంబే హైకోర్టు
X

ముంబై: ‘చీమను చంపేందుకు సుత్తి వాడుతారా..?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం ఇటీవల రూపొందించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడింది. సవరించిన నిబంధనల ప్రకారం.. ఏర్పాటు చేయనున్న ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను ఎవరు తనిఖీ చేస్తారని ప్రశ్నించింది. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ చెప్పేదే ఫైనల్ అన్నట్లు నిబంధనలు రూపొందించారని విమర్శించింది. నకిలీ, అబద్ధం సమాచారం ఏదో నిర్ణయించే సంపూర్ణ అధికారం ఒక ప్రభుత్వ అధికారికి ఇవ్వడం తప్పుడు నిర్ణయమని పేర్కొన్నది.

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక పౌరుడి మాదిరిగా ప్రభుత్వం కూడా ఒక భాగస్వామి మాత్రమేనని, ప్రశ్నించడం, సమాధానాలు కోరడం ఒక పౌరుడి ప్రాథమిక హక్కు అని, స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉదని న్యాయమూర్తులు గౌతమ్ పటేల్, నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

కేంద్రం సవరించిన ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్ వేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఏదో ఒక స్థాయిలో, ఎవరైనా సోషల్ మీడియాలో కంటెంట్‌ను ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిందేనని, కొంత ఫ్యాక్ట్ చెకింగ్ ఉండాల్సిందేనని, అయితే.. అది మితిమీరి ఉండకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఐటీ నిబందనలకు ఇంతటి భారీ సవరణల అవసరం ఏంటో ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నామని ధర్మాసనం పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed