Australia Today : భారత్‌పై అక్కసుతో.. ‘ఆస్ట్రేలియా టుడే’‌పై కెనడా బ్యాన్

by Hajipasha |
Australia Today : భారత్‌పై అక్కసుతో.. ‘ఆస్ట్రేలియా టుడే’‌పై కెనడా బ్యాన్
X

దిశ, నేషనల్ బ్యూరో : కెనడా(Canada) ప్రభుత్వం వివాదాల వలయంలో కూరుకుపోతోంది. తాజాగా అది మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ‘ఆస్ట్రేలియా టుడే’(Australia Today) యూట్యూబ్ ఛానల్, న్యూస్ వెబ్‌‌సైట్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్(Jaishankar), ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సమావేశం వేదికగా కెనడాపై జైశంకర్ ఫైర్ అయ్యారు. ఖలిస్తాన్ తీవ్రవాద మూకలకు కెనడా రాజకీయ మద్దతు ఇస్తున్న తీరును ఆయన వివరించారు.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమయ్యాక కొన్ని గంటల్లోనే.. ‘ఆస్ట్రేలియా టుడే’పై బ్యాన్ విధిస్తున్న విషయాన్ని తెలుపుతూ కెనడా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు. ‘‘కెనడా నిర్ణయం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. విచిత్రంగా అనిపించింది’’ అని ఆయన ఎద్దేవా చేశారు. మీడియా స్వేచ్ఛ విషయంలో కెనడా ప్రభుత్వ కుటిల విధానాలకు ఈ ఘటన నిదర్శనమన్నారు. ‘‘జైశంకర్ చేసిన వ్యాఖ్యలను నిశితంగా విని ఉంటే.. కెనడా ప్రభుత్వానికి చేస్తున్న తప్పులు తెలిసొచ్చి ఉండేవి’’ అని రణధీర్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed