ఎన్డీయే కూటమికి కేబినెట్ టాస్క్ .. జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల భేటీ

by Prasad Jukanti |
ఎన్డీయే కూటమికి కేబినెట్ టాస్క్ .. జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో:కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ చకచక అడుగులు వేస్తోంది. ఎన్డీయే కూటమి నేతగా నరేంద్ర మోడీని నిన్న ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఈ నెల 9వ తేదీన మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ నివాసంలో గురువారం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు సమావేశమయ్యారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ, మంత్రివర్గంలో మిత్రపక్షాలకు వాటా, మంత్రివర్గ కూర్పుపై ఈ భేటీలో కసరత్తు చేస్తున్నారు. ఈ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ నుంచి సురేశ్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హోసబెళె తదితరులు హాజరై కీలక అంశాలపై చర్చిస్తున్నారు.

కూటమి ముందు కేబినెట్ టాస్క్:

ఈసారి బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో మిత్రపక్షాల అండదండలు అనివార్యంగా మారాయి. దీంతో కేబినెట్ లో చోటు కోసం మిత్రపక్షాల పట్టు పట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ముందు కేబినెట్ కూర్పు చేయడం బిగ్ టాస్క్ అనే చర్చజరుగుతోంది. టీడీపీ, బీజేపీలకు కేబినెట్ లో సముచిత స్థానం ఉండబోతున్నదనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలుచుకున్నందునా రాష్ట్రానికి సైతం మరింత ప్రయారిటీ దక్కనుందన్న డిస్కషన్ జరుగుతోంది. దీంతో ఎవరికి ఏ శాఖ అనేది చర్చనీయాశంగా మారింది. ఇదిలా ఉంటే మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 13 మంది కేంద్ర మంత్రులు పరాజయం పాలయ్యారు. దీంతో ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహించిన మంత్రుల ఓటమితో ఆ శాఖలను ఎవరికి అప్పగించాలి? అలాగే ఎన్నికల్లో గెలుపొందిన తాజా మాజీ మంత్రులలో ఎంత మందిని కంటిన్యూ చేయాలి అనేదానిపై ఈ భేటీలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలైన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కారి వంటి వారి శాఖలలో ఏదైనా చేర్పులు ఉండబోతున్నాయా అనేది కూడా ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story