- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాపార వైరంతో ‘రామేశ్వరం కేఫ్’ పేలుడు .. ? హోం మంత్రి కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన టైం బాంబు పేలుడు ఘటనపై రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర కీలక వివరాలను వెల్లడించారు. వ్యాపార పోటీ వల్ల కూడా ఆ దాడి జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘‘వ్యాపార ప్రత్యర్థులు అసూయతో ఇలా చేసి ఉండొచ్చు. రామేశ్వరం కేఫ్‌కు ఇప్పటికే 11 బ్రాంచీలు ఉన్నాయి. 12 బ్రాంచీని తెరిచేందుకు యజమానులు అడ్వాన్స్ డిపాజిట్ కూడా చెల్లించారు’’ అని పేర్కొన్నారు. ‘‘మేం ఈ కేసును ఛేదించి తీరుతాం. ఎంత కష్టమైనా దీని వెనుక ఉన్నవాళ్ల బండారం బయటపెడతాం’’ అని పరమేశ్వర స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఏవైనా సంస్థలు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. కర్ణాటకలోని సుస్థిర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు, రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎవరైనా గిట్టనివారు ఈ పేలుడు జరిపి ఉంటారనే అనుమానాన్ని రాష్ట్ర హోం మంత్రి వెలిబుచ్చారు. టోపీ, మాస్క్, అద్దాలు ధరించిన వ్యక్తి రామేశ్వరం కేఫ్‌లోకి వచ్చి టిఫిన్ బాంబును వదిలి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీని బట్టి వెల్లడైందన్నారు. అతడి ఆచూకీని గుర్తించేందుకు కర్ణాటక పోలీసుల ఎనిమిది బృందాలు, జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్, ఇంటెలీజెన్స్ బ్యూరో టీమ్‌లు కలిసి పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ‘‘నిందితుడు బస్సులో రామేశ్వరం కేఫ్ ఏరియాకు చేరుకున్నాడు. ఆ సమయంలో 26 బస్సులు కేఫ్ పరిసరాలకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడు వచ్చిన బస్సును కూడా మేం గుర్తించాం. దాదాపు 50 సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది’’ అని రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర వివరించారు.