మణిపూర్ అల్లర్ల వెనుక బ్రిటన్ ప్రొఫెసర్..కేసు నమోదు చేసిన పోలీసులు!

by vinod kumar |
మణిపూర్ అల్లర్ల వెనుక బ్రిటన్ ప్రొఫెసర్..కేసు నమోదు చేసిన పోలీసులు!
X

దిశ, నేషనల్ బ్యూరో: గత ఏడాదిన్నర కాలంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ అల్లర్ల వెనుక భారత సంతతికి చెందిన ఓ బ్రిటన్ ప్రొఫెసర్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఉదయ్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆయన మణిపూర్‌లో మతాల పేరిట పలు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉదయ్ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో మైతీల విశ్వాసాలను అవమానించాడని, ఇతర వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించాడని పిటిషనర్ ఆరోపించారు.

ఆన్‌లైన్ సందేశాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మణిపూర్‌లో జాతి హింసకు గురైన వ్యక్తులను ప్రేరేపించాడని సమాచారం. అంతేగాక కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటు వాదులతోనూ ఆయనకు సంబంధాలున్నట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణకు సిద్ధమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ కంప్యూటర్ సైన్స్ విభాగానికి పోన్ చేయగా అక్కడి నుంచి స్పందన రాలేదు. అయితే ఈ విషయంపై ఉదయ్ రెడ్డి అధికారికంగా స్పందించలేదు. ఉదయ్ రెడ్డికి ఖలీస్థానీలతో పాటు నార్కో టెర్రరిస్టు బృందాలతో కూడా సంబంధం ఉందని తెలుస్తోంది. నిందితుడి ఫోన్‌కాల్స్, ఆర్థిక కార్యకలాపాలను ఆరాతీయాల్సి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

Next Story