బెడిసికొట్టిన నెంబర్ ‘సిక్స్’.. బాస్‌కు కలిసిరాని సెంటిమెంట్‌

by Shiva |   ( Updated:2024-07-06 01:41:09.0  )
బెడిసికొట్టిన నెంబర్ ‘సిక్స్’.. బాస్‌కు కలిసిరాని సెంటిమెంట్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేండ్ల పాలనలో ‘సిక్స్’ సెంటిమెంట్‌తో ముందుకు సాగిన మాజీ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు అదే సెంటిమెంట్ రివర్స్‌గా మారుతున్నది. కారు నంబర్ సహా సచివాలయంలోని ఛాంబర్, కీలక అధికారిక కార్యక్రమాలకు తేదీల ఫిక్స్.. ఇలాంటి అన్నింటా ‘సిక్స్’ సెంటిమెంట్‌నే ఆయన పాటించారు. అధికారం చేజారిన తర్వాత ఆ సెంటిమెంట్ ఆయనకు వర్కవుట్ కావడంలేదు. సరిగ్గా ఇదే సెంటిమెంట్‌ను కాంగ్రెస్ తన వ్యూహంగా మల్చుకున్నది. ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్... శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పేసింది. త్వరలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలను థర్డ్ బ్యాచ్‌గా ‘హస్తం’లో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీలో చేరేందుకు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీకులు ఇచ్చాయి. మరో ‘సిక్స్’ ఖాయమంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఓపెన్‌గానే చెప్పారు.

మనశ్శాంతి లేకుండా చేస్తున్న ‘సిక్స్’ సెంటిమెంట్

కేసీఆర్‌ను మానసికంగా దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ ఏ అస్త్రాన్నీ వీడడం లేదు. చివరకు ‘సిక్స్’ సెంటిమెంట్‌ కూడా కేసీఆర్ మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నా... వెళ్లిపోతారని తెలిసినా కేసీఆర్ ఫామ్‌హౌజ్ దాటి బయటకు రావడం లేదన్న చర్చ ఆ పార్టీ లీడర్లలోనే జోరుగా సాగుతున్నది. లోక్‌సభ ఫలితాలకు ముందు యాక్టివ్‌గా ఉన్న కేటీఆర్ ఆ తర్వాత నుంచి తన కదలికలను తగ్గించుకోవడంపైనా ఇప్పటికే రకరకాల చర్చలు జరిగాయి. ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరినా దానిపై పార్టీ అధినేత రివ్యూ చేయకపోవడాన్ని, మరో ఆరుగురు చేరబోతున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు మీడియా సమావేశాల్లోనే చెబుతున్నా నివారణ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారనే వార్తలు వెలువడుతున్నా మౌన వాతావరణమే ఆ పార్టీలో నెలకొన్నది.

ఎమ్మెల్యేలు ఏ క్షణంలోనైనా చేరే అవకాశం

మంత్రివర్గ విస్తరణకు ఆషాఢం సెంటిమెంట్‌గా మారినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవడంలేదని, ఏ క్షణమైనా ఆరుగురు లాంఛనంగా చేరడం ఖాయమన్నది హస్తం నేతల సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు ఉన్నది ఇద్దరు ఎమ్మెల్యేలే కావడంతో అందరి చూపూ కోవ లక్ష్మి (ఆసిఫాబాద్ ఎమ్మెల్యే), అనిల్ జాదవ్ (బోధ్ ఎమ్మెల్యే)పై పడింది. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సైతం బీఆర్ఎస్‌కు ఇద్దరే ఎమ్మెల్యేలు ఉండడంతో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), విజయుడు (ఆలంపూర్) పార్టీ మారుతున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. హైదరాబాద్‌లోని ఇద్దరు ఎమ్మెల్యేలూ ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీకులు ఇవ్వడంతో ఆ ఇద్దరు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 24 మంది ఎమ్మెల్యేలలో అత్యధికంగా బీఆర్ఎస్‌కు 16 మంది, మజ్లిస్‌కు ఏడుగురు, బీజేపీకి ఒకరు చొప్పున ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఆ ఇద్దరు ఎవరనేదే ఉత్కంఠగా మారింది.

ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది కార్పొరేటర్లు గైర్హాజరు

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై బీఆర్ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో వారంతా కాంగ్రెస్ గూటికి చేరే వారేనా అనే డిస్కషన్ గులాబీ పార్టీలో మొదలైంది. ఆబ్సెంట్ అయినవారు వెంటనే కాకపోయినా కాస్త ఆలస్యంగానైనా బీఆర్ఎస్‌ను వీడక తప్పదనే జనరల్ టాక్ ఎలాగూ ఉన్నది. వీరిలో ఎందరు కాంగ్రెస్‌లో చేరుతారు, ఎందరు బీజేపీవైపు చూస్తున్నరనేది త్వరలో తేటతెల్లం కానున్నది. కీలకమైన సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చినా ఆబ్సెంట్ కావడం వెనక పక్క చూపులు చూస్తున్నారనే కారణంకంటే బలమైనది ఇంకోటి ఉండదనేది గులాబీ లీడర్ల భావన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ సైతం చొరవ తీసుకోకపోవడం అనేక ఊహాగానాలకు తావిచ్చినట్లయింది.

ఆరుగురి చేరికపై సస్పెన్స్ కంటిన్యూ

బీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరుతారనేది మాత్రం సస్పెన్స్ గా ఉండిపోయింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి చేరడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనను చేర్చుకోవద్దంటూ ఆ సెగ్మెంట్‌కు చెందిన కాంగ్రెస్ ఇన్‌చార్జి సరిత ఇప్పటికే సీఎం రేవంత్‌కు రిక్వెస్టు చేశారు. ఆమె అభిప్రాయానికి మద్దుతుగా ఆమె అనుచరులు స్థానికంగా సెల్ టవర్ ఎక్కి నిరసనలు చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం సైతం గద్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు రకరకాల కామెంట్లు చేశారు. ఇక ఆలంపూర్ ఎమ్మెల్యే (బీఆర్ఎస్) విజయుడి చేరిక విషయంలోనూ అక్కడి స్థానిక లీడర్ సంపత్‌తో మాట్లాడి కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దాదాపు చేరుతారనే అభిప్రాయం గాంధీభవన్‌లో వినిపిస్తున్నది. ఈ విషయమై వెళ్లేవారు ఎవరనే చర్చకంటే గులాబీ పార్టీలో ఉండేదెవరు అని మాట్లాడుకోవడం బెటర్ అంటూ ఒక గులాబీ లీడర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed