నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ.. ఫస్ట్‌టైమ్ మెయిన్ సీట్లలో మహిళలు

by Anjali |
నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ.. ఫస్ట్‌టైమ్ మెయిన్ సీట్లలో మహిళలు
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పాలక మండలి శనివారం సమావేశం కానుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు ఎవరికి వారే వ్యూహం, ప్రతి వ్యూహాలతో హజరుకానున్నట్లు సమాచారం. కౌన్సిల్‌లో సంఖ్యాలం ఎక్కువగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలంటూ పట్టుబట్టే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్దం జరిగే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన జీహెచ్ఎంసీ అధికారులు భారీ సంఖ్యలో మార్షల్స్‌ను రంగంలోకి దింపేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 39 మంది కార్పొరేటర్లున్న బీజేపీ పార్టీ కౌన్సిల్‌లో గ్రేటర్ హైదరాబాద్ వాసుల సమస్యలను గట్టిగా వినిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని పైపులతో బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దీంతో పాటు జీహెచ్ఎంసీ అడ్వర్‌టైజ్‌మెంట్లు, శానిటేషన్ విభాగంలో జరిగిన అవకతవకలపై అడ్‌హక్ కమిటీ చేస్తున్న సిఫార్సుల అమలు, జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వ బకాయి పడ్డ నిధుల గురించి కౌన్సిల్‌లో గళం విప్పాలని కమలనాధులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో అడ్డదారిలో కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు పొందిన వ్యవహరంపై అధికారులను నిలదీయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. ఎప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగినా మజ్లిస్ పాత్ర ఆసక్తికరంగాను, కీలకంగానే ఉంటుంది. శనివారం జరగనున్న కౌన్సిల్ సమావేశంలోనూ మజ్లిస్ పార్టీ పాత్ర కీలకంగా మారనుంది. మజ్లిస్ పార్టీ ముఖ్యంగా మొహర్రం పండుగ ఏర్పాట్లతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో దోమల నివారణ, శానిటేషన్ సమస్యలపై అధికారులను ప్రశ్నించేందుకు సిద్దమైనట్లు సమాచారం.

మారుతున్న బలాబలాలు..

2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 56 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలుపొందగా, ఇప్పుడా సంఖ్యా 47కు తగ్గింది. ఇదే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన విజయారెడ్డి ఫస్టు కాంగ్రెస్‌లో చేరడంతో అప్పటి వరకు కౌన్సిల్‌లో కేవలం రెండుకే పరిమితమైన కాంగ్రెస్ కార్పొరేటర్ల బలం కాస్త మూడుకు పెరిగింది. రాష్ట్రంలో అధికారం మారి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్ పగ్గాలు చేపట్టిన గద్వాల్ విజయలక్ష్మి, శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి కార్పొరేటర్ బొంతు శ్రీదేవ, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ సైతం కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం కౌన్సిల్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 19కి పెరిగింది. శనివారం కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసేందుకు తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ హైకమాండ్ నిర్వహించిన సమావేశానికి ఎనిమిది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు డుమ్మాకొట్టినట్లు సమాచారం. వీరంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కౌన్సిల్‌లో కాంగ్రెస్ బలం 27కు పెరిగే అవకాశముంటుంది.

మూడు సీట్లకు తగ్గిన మజ్లిస్..

గతంలో ఎన్నడూ లేని విధంగా మజ్లిస్ పార్టీ కార్పొరేటర్ల సంఖ్య ఈ పర్యాయం మూడు సీట్లకు తగ్గింది. బహదూర్‌పురా, మెహిదీపట్నం డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన మోబిన్, మాజీద్ హుస్సేన్‌ బహదూర్‌పురా, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఆ రెండు డివిజన్ల కార్పొరేటర్ సీట్లు ఖాళీ అయ్యాయి. ఇక ఎర్రగడ్డ డివిజన్ నుంచి గెలిచిన మజ్లిస్ మహిళా కార్పొరేటర్, గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి గెలిచిన దేవర కరుణాకర్‌లు మృతిచెందడంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం నాలుగు కార్పొరేటర్ల సీట్లు ఖాళీగా కాగా, మొత్తం 150 సీట్లలో 146 సీట్లకు గాను పార్టీల బలాబలాలిలా ఉన్నాయి. బీఆర్‌ఎస్ 47, ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ 19 మొత్తం 146 సీట్లుగా ఉన్నాయి. (మిగిలిన నాలుగు కార్పొరేటర్ల సీట్లు ఖాళీగా ఉన్నాయి).

Advertisement

Next Story

Most Viewed