- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు బిగ్ రిలీఫ్
దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. వెంటనే ఆయన్ను జైలు నుండి విడుల చేయాలని శుక్రవారం ఆదేశించింది. ఆయనతో పాటు ఈ కేసులో న్యాయస్థానం మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మరేదైనా కేసులో వీరు నిందితులుగా ఉంటే మినహా.. వీరందరినీ తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నయన్న ఆరోపణలపై 2014 మే నెలలో సాయిబాబా, ఓ జర్నలిస్టు, జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్థి సహా మరి కొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 2017 మార్చిలో సెషన్ కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి వీరు నాగ్ పూర్ సెంట్రల్ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. తమకు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సాయిబాబాతో సహా మిగతా దోషులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది.
ఈ కేసులో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా నిందితుల్లో ఒకరైన పాండు పోరా నరోటే ఆగస్టు 2022లో మరణించారు. పోస్ట్ పోలియో పక్షవాతం కారణంగా వీల్ చైర్ కే పరిమితమైన సాయిబాబా వైద్య కారణాలతో శిక్షను నిలిపివేయాలని కోరుతూ గతంలో దరఖాస్తు చేశారు. కిడ్నీ, వెన్నుపాము సమస్యలతో పాటు పలు రోగాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే 2019లో, శిక్షను సస్పెండ్ చేయాలన్న అతని దరఖాస్తును హైకోర్టు తిరస్కరించగా తాజాగా ఆయన్ను నిర్దోషి అని తేల్చింది. ఇదిలా ఉంటే 2014 లో అరెస్ట్ అయిన సాయిబాబాను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. గతేడాది ఆయనను పూర్తిగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా సాయిబాబా నిర్దోషి అని కోర్టు ప్రకటించడంతో ఆయన్ను తిరిగి విధుల్లో చేర్చుకుంటారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.