జీలం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు

by Ramesh N |
జీలం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీలం ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం బాంబు బెదిరింపులు కలకలం రేపింది. పూణె నుంచి జమ్మూ తావికి వెళ్తున్న జీలం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎస్-9 కోచ్‌లో బాంబు ఉన్నట్లు ఓ ప్రయాణికుడు రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు రైలు భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే.. డాగ్‌ స్వ్కాడ్‌, బాంబ్‌ స్వ్కాడ్‌తోపాటు జీఆర్‌పీఎఫ్‌, ఆర్పీఎఫ్‌ సిబ్బంది గంటకు పైగా రైలును తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులందరినీ ఖాళీ చేయించారు. అనంతరం సుమారు గంటపాటు రైలును నిశితంగా పరిశీలించారు.

అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు. దీంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత రైలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బాంబు గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, అతని మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. కాగా, దేశంలో ఇటీవల వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 100 పాఠశాలలకు ఒకేసారి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. రోజంతా పోలీసులు జరిపిన విచారణలో వచ్చిన బెదిరింపులన్నీ బూటకమని తేలింది.

Advertisement

Next Story