కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా దర్యాప్తు సంస్థలను రాజకీయం చేస్తోంది: బీఎస్పీ మాయావతి

by S Gopi |
కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా దర్యాప్తు సంస్థలను రాజకీయం చేస్తోంది: బీఎస్పీ మాయావతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆమె.. గతంలో కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీ కూడా దర్యాప్తు సంస్థలను రాజకీయానికి వాడుకుంటోందని విమర్శించారు. గడిచిన రెండేళ్లలో దేశవ్యాప్తంగా పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయని అన్నారు. 'స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే, ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే బీజేపీ గెలవడం అంత సులభం కాదు. కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ సైతం పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలను నియంత్రించడంలో విఫలమైంది. ఇవన్నీ గత రెండేళ్లలో విపరీతంగా పెరిగాయి. కేంద్రం అత్యంత పేదలకు రేషన్ ఇస్తోంది. కానీ ఉపాధి కల్పించడమే అసలైన పరిష్కారం' అని మాయావతి అన్నారు. దేశంలో అవినీతి తగ్గుముఖం పట్టలేదని, దేశ సరిహద్దులు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సురక్షితంగా లేవని, ఇది ఆందోళన కలిగించే విషయం. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అన్ని విధాల కృషి చేయాల్సి ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి, కూలీలకు అచ్ఛే దిన్(మంచిరోజులు) ఇస్తామన్న బీజేపీ వాగ్దానం నెరవేరలేదన్నారు. హామీ నెరవేర్చడం మానేసి బీజేపీ తన బలాన్ని, సమయాన్ని పెట్టుబడిదారులకు, వారి ప్రియమైన ధనవంతులకు లాభాలను సృష్టించడంపై పనిచేస్తోందని ఆమె తెలిపారు. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతుల కోసం కాంగ్రెస్ పనిచేయకపోవడం వల్లనే బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందని మాయావతి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల తరహాలోనే బీజేపీ కులతత్వ, మతతత్వ, పెట్టుబడిదారీ మనస్తత్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed