120 మందితో బీజేపీ తొలి జాబితా.. కీలక అంశాలివీ!

by Hajipasha |
120 మందితో బీజేపీ తొలి జాబితా.. కీలక అంశాలివీ!
X

దిశ, నేషనల్ బ్యూరో : సాధ్యమైనంత త్వరగా లోక్‌సభ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. దాదాపు 100 నుంచి 120 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను రిలీజ్ చేయాలని బీజేపీ అగ్రనేతలు ప్రాథమికంగా నిర్ణయించారని సమాచారం. శనివారం లేదా ఆదివారం రోజు అభ్యర్థుల తొలి లిస్టును కమలదళం విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కీలక అభ్యర్థుల స్థానాలివీ..

ఫస్ట్ లిస్టులో బీజేపీకి ఆయువుపట్టుగా ఉన్న హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల పేర్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సహా హై ప్రొఫైల్ అభ్యర్థులందరి పేర్లు మొదటి లిస్టులోనే ఉంటాయని అంటున్నారు. ఈసారి కూడా వారణాసి నుంచే ప్రధాని మోడీ బరిలోకి దిగుతారట. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి అమిత్ షా, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అమేథీ స్థానం నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీచేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ సారి చాలామంది సిటింగ్‌ ఎంపీలకే బీజేపీ మళ్లీ టికెట్లు ఇస్తుందని జాతీయ మీడియా అంచనా వేస్తోంది.

ఆ కేంద్రమంత్రులు ఈసారి లోక్‌సభ బరిలోకి..

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగిందని తెలిసింది. రాజ్యసభ ఎంపీలుగా ఉన్న కేంద్రమంత్రులను ఈసారి లోక్ సభ బరిలోకి దింపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయమంత్రి వీ మురళీధరన్‌లు ఈసారి లోక్‌సభకు పోటీ చేస్తారని అంటున్నారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ గుణ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హాపై భోజ్ పురి స్టార్ పవన్ సింగ్ ను బీజేపీ పోటీకి దించే ఛాన్స్ ఉందట. ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా కొలిక్కిి రాలేదు. ఈనేపథ్యంలో ఇండియా కూటమిపై ఒత్తిడిని మరింత పెంచే వ్యూహంతోనే బీజేపీ సాధ్యమైనంత త్వరగా తొలి జాబితాను విడుదల చేయాలని అనుకుంటోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాలపై మునుపటి కంటే ఈసారి బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story