రాహుల్‌పై బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోంది: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ

by samatah |
రాహుల్‌పై బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోంది: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ యంత్రాంగం మొత్తం రాహుల్ గాంధీపై అసత్య ప్రచారం చేయడంలో నిమగ్నమైందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆరోపించారు. బుధవారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తుల్వాసలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇక్కడి ప్రజలు నాయకులను బాగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. ‘ఇందిరా గాంధీ విధానం రాయ్ బరేలీ ప్రజలకు నచ్చక ఆమెను ఓడించారు. కానీ ఆ తర్వాత ఆత్మపరిశీలన చేసుకుని. మళ్లీ ఇందిరాను ఎన్నుకున్నారు. నాయకులను అర్థం చేసుకోవడం రాయ్ బరేలీ ప్రజల ప్రత్యేకత’ అని అన్నారు. రాహుల్ పై తప్పుడు ప్రచారాలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు.

కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోందని ఎప్పుడో స్పష్టమైందని తెలిపారు. కానీ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వస్తుందని గ్రహించిన ప్రధాని మోడీ మాటమార్చారని విమర్శించారు. బీజేపీ మతం, కులం, గుడి-మసీదు గురించి మాత్రమే మాట్లాడుతుందని, ప్రజలకు సంబంధించిన వాస్తవ సమస్యలపై ఎన్నడూ మాట్లాడటం లేదని ఆరోపించారు. అంతుముందు ప్రియాంకా రాయ్‌బరేలీ ప్రజలతో తమ పార్టీకి 100 ఏళ్ల అనుబంధం కొత్త శకంలోకి ప్రవేశించిందని, నియోజకవర్గ ప్రజలు మరోసారి తమ నాయకత్వానికి సిద్ధంగా ఉన్నారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కాగా, యూపీలోని రాయ్ బరేలీ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2004 నుంచి 2019 వరకు ఈ సెగ్మెంట్‌లో సోనియా గాంధీ ఎంపీగా గెలుపొందారు. అయితే అనారోగ్య కారణాల వల్ల సోనియా పోటీ నుంచి తప్పుకోవడంతో రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున దినేష్ ప్రతాప్ సింగ్‌ బరిలో ఉన్నారు.

Advertisement

Next Story