పాక్, బంగ్లా ప్రజలకు బీజేపీ తలుపులు తెరిచింది: సీఏఏ అమలుపై కేజ్రీవాల్ విమర్శలు

by samatah |
పాక్, బంగ్లా ప్రజలకు బీజేపీ తలుపులు తెరిచింది: సీఏఏ అమలుపై కేజ్రీవాల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్థిక సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్నికలకు ముందు సీఏఏను ముందుకు తీసుకొచ్చారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏఏ అమలు ద్వారా పాక్, బంగ్లాదేశ్ పౌరులకు బీజేపీ తలుపులు తెరిచిందని ఆరోపించారు. ఇది దేశానికి, ముఖ్యంగా రాష్ట్రాలకు చాలా ప్రమాదకరమైందని అభివర్ణించారు. ఈశాన్య రాష్ట్రాలు సీఏఏ వల్ల తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలస దారుల వల్ల అసోం సంస్కృతి ఇప్పటికే దెబ్బతిందని గుర్తు చేశారు. సీఏఏ కింద పాకిస్థానీ శరణార్థులను భారత్‌లో స్థిరపరిచేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పొరుగు దేశాల్లో నివసిస్తున్న మైనారిటీ వర్గాలకు చెందిన లక్షలాది మందికి ఈ చట్టం ఇండియాలోకి ద్వారాలు తెరిచిందని తెలిపారు. ‘పాకిస్థానీ ప్రజలను భారత్‌లో స్థిరపరచడానికి ప్రభుత్వ సొమ్మును వినియోగిస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో సుమారు 3 కోట్ల మందికి పైగా మైనారిటీలు ఉన్నారు. సీఏఏ అమలుతో వీరంతా భారత్ కు వస్తారు’ అని చెప్పారు. ఈ శరణార్థులు భారత్‌కు వచ్చిన తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ శరణార్థులకు ఎవరు ఉపాధి కల్పిస్తారు? ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో మాత్రమే భాగం అని ఆరోపించారు. ‘దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. వీటి కారణంగా సామాన్య ప్రజలకు కుటుంబాన్ని నడపటం కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో వీటి గురించి మాట్లాడకుండా దేశం దృష్టిని మరల్చేందుకు మాత్రమే సీఏఏను ముందుకు తీసుకొచ్చింది’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed