పాకిస్తాన్ కూడా ఆ సాహసం చేయలేదు.. రాహుల్ కేంబ్రిడ్జి ప్రసంగంపై బీజేపీ ధ్వజం

by Mahesh |
పాకిస్తాన్ కూడా ఆ సాహసం చేయలేదు.. రాహుల్ కేంబ్రిడ్జి ప్రసంగంపై బీజేపీ ధ్వజం
X

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కేంబ్రిడ్జీ యూనివర్సిటీ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగించడం పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ గడ్డ మీద ఉండి, భారత్‌పై విమర్శలు చేయడమేంటని నిలదీసింది. పాకిస్తాన్ కూడా ఎలాంటి సాహసం ఎన్నడూ చేయలేదని ధ్వజమెత్తింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచమంతా భారత్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే, ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత(రాహుల్) మాత్రం విదేశీ గడ్డపై ఉండి భారత్‌‌లో ప్రజాస్వామ్యం నాశమైందని, న్యాయ వ్యవస్థ, మీడియా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.

యావత్ ప్రపంచం భారత్‌ను ప్రకాశవంతమైన దేశంగా చూస్తున్న తరుణంలో, విదేశీ సంస్థలు చైనాను వీడి భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సమయంలో రాహుల్ వారిని బెదరగొడుతున్నారని వెల్లడించారు. ‘రాహుల్ ఓ ప్రఖ్యాత యూనివర్సిటీలో భారత్‌ గురించి అక్కడి ప్రజలకు చెడుగా చెబుతున్నారు. ఇప్పటివరకు పాకిస్తాన్ కూడా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ గురించి ఇలా చెప్పేందుకు సాహసించలేదు’ అని వెల్లడించారు. భారత ప్రతిష్టను దిగజార్చేందుకు రాహుల్ ఏదైనా ఏజెన్సీ నుంచి డబ్బులేమైనా తీసుకున్నారా అని ప్రశ్నించారు. భారత్‌లోని మైనార్టీలను కేంద్రం ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తోందన్న రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం దేశాన్ని నాశనం చేయడానికి ఎంతకైనా దిగజారుతుంది.

మీరు మీ రాజవంశ పార్టీ(కాంగ్రెస్)కి ప్రకాశవంతమైన వ్యక్తివి కానుందున, దేశమే ప్రకాశవంతమైన ప్రదేశం కాదంటే ఎలా’ అని ఎద్దేవా చేశారు. పెగాసస్‌తో నిఘా ఉంచారన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, దీనిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి మీరు, మీ పార్టీ నేతలు ఫోన్లను ఎందుకు సమర్పించలేదని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. దేశం జీ20కి ఆతిథ్యం ఇస్తున్న సమయంలో, ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రపంచ నాయకులు గుర్తిస్తున్న సమయంలో రాహుల్ వ్యాఖ్యలు దారుణమని నిప్పులు చెరిగారు.

రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని ఎవరైనా చల్లార్చగలరంటే అది మోడీయేనని సంబిత్ అన్నారు. కాగా, ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. శుక్రవారం కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగించిన విషయం తెలిసిందే. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, స్వతంత్ర సంస్థలను బీజేపీ ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకుందని, దేశాన్ని గాలికొదిలేసిన ప్రధాని మోడీ.. తనతోపాటు ప్రతిపక్ష నేతల ఫోన్లపై పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘా ఉంచారంటూ విమర్శించారు.

‘జవాన్లను అవమానించడానికి ఎంత ధైర్యం’

రాహుల్ ప్రసంగంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రసంగంలో రాహుల్ గాంధీ 40 సైనికులు చనిపోయిన పుల్వామా దాడిని కారు బాంబుగా అభివర్ణించారు. జవాన్లను అవమానించడానికి ఎంత ధైర్యం? అది కారు బాంబు కాదు సార్.. ఉగ్రదాడి. ఇది కాంగ్రెస్‌కు, ఉగ్రవాదులకు మధ్య కుదిరిన అవగాహనలో భాగమేనా’ అంటూ ప్రశ్నించారు. మరో ట్వీట్‌లో.. ‘భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నానని రాహుల్ చెప్పారు. ఇప్పుడు నిజం మాట్లాడుదాం. మోడీ ప్రభుత్వం కల్పించిన భద్రతతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాహుల్ 4,000 వేల కిలోమీటర్ల యాత్ర చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు చేపట్టిన యాత్రలను ఎలా అడ్డుకున్నారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.

బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించనున్న రాహుల్!

మూడ్రోజుల పర్యటన కోసం ఇంగ్లాండ్ వెళ్లిన రాహుల్ గాంధీ.. బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 6న వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లోని గ్రాండ్ కమిటీ రూంలో ఉభయ సభలనుద్దేశించి మాట్లాడనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ‘రాహుల్ ప్రసంగం కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది? భవిష్యత్తులో బ్రిటన్ ప్రభుత్వాలు, నేతలతో ఎలా వ్యవహరిస్తుందనే అంశాలు ఆసక్తికరంగా మారాయి’ అని భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. రాహుల్ పర్యటనలో ప్రవాస భారతీయులు కూడా భాగస్వాములు కానున్నారు. వారి రిజిస్ట్రేషన్లు 2 వేలకు దాటినట్టు సమాచారం.

Advertisement

Next Story