ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అభ్యర్థులపై బీజేపీ ఫోకస్..

by Vinod kumar |
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అభ్యర్థులపై బీజేపీ ఫోకస్..
X

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ భేటీలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎన్నికల కమిటీలోని ముఖ్యనేతలు పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాలలో సీఎం అభ్యర్థి లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.

మరోవైపు బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తొలుత 15 నిమిషాల పాటు మాజీ సీఎం వసుంధరరాజేతో చర్చించారు. ఆ తర్వాత మిగిలిన నాయకులతో సమాలోచనలు జరిపారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2 గంటల వరకు సాగిన ఈ సమావేశాల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార వ్యూహాలపై కసరత్తు జరిగిందని తెలుస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్​, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్ లను బీజేపీ అధిష్ఠానం కోరిందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed