వచ్చే ఎన్నికల్లో జగన్‌కి ఆ 11 సీట్లు కూడా రావు: మంత్రి నారాయణ

by karthikeya |
వచ్చే ఎన్నికల్లో జగన్‌కి  ఆ 11 సీట్లు కూడా రావు: మంత్రి నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి, ఆయన పత్రికలు చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా కనిపిస్తోందని, ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో దక్కే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వరదల్లో నష్టపోయిన వారికి పరిహారంగా రూ.601 కోట్లను ప్రభుత్వం అందించిందని, వరదల్లో ఏ విధంగా నష్టపోయినా.. అందరినీ తమ ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. అయితే తమ ప్రభుత్వం ఖర్చుపెట్టింది రూ.601 కోట్లని అధికారికంగా చెబుతున్నా.. దీనిపై జగన్మోహన్ రెడ్డి తన పత్రికల్లో రూ.5,034 కోట్లు దుర్వినియోగం అయ్యాయని వార్తా కథనాలు రాయిస్తున్నాడని, ఇదెలా సాధ్యమో తమకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

అసలు వరదలు సంభవించినప్పుడు జగన్ ఎక్కడున్నాడో ముందు చెప్పాలని, ఏదో ఫోటోల కోసం ఒక్కసారి పర్యటించి వెళ్లిపోయాడని, కానీ తమ నాయకుడు చంద్రబాబు 10 రోజుల పాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. జగన్‌లా పరదాల మధ్య దాక్కోలేదని విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ తో పాటు హోం మంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story