ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె..

by Aamani |
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె..
X

దిశ,ఖమ్మం : ఖమ్మం ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాలంటూ ఆసుపత్రి ఆవరణలో సమ్మె బాట పట్టారు. బుధవారం ఉదయం నుంచి విధులకు హాజరు కాకుండా ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. మూడు నెలలుగా చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ కాంట్రాక్టర్ ప్రసాద్ రెడ్డి జీతాలు ఇవ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు పూనుకున్నారు. ప్రభుత్వం నుంచి మాకు బడ్జెట్ ఇవ్వకపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వలేదని కాంట్రాక్టర్ చెబుతున్నారు. మూడు రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడంతో ఆసుపత్రిలో పారిశుధ్యం చేయకపోవడంతో వార్డుల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

దాంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఓపీలో సిబ్బంది లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె లో ఉండటంతో మున్సిపల్ కార్మికులను పిలిపించి పారిశుధ్యం చేయాలని అధికారులు సూచించడంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను లోపలకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే పొలీసులు అక్కడికి చేరుకుని శాంతింపజేశారు. కాంట్రాక్టర్ జీతాలు ఇచ్చే దాకా విధుల్లోకి వచ్చేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

అసలు ఏం జరుగుతోంది..

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 575 పడకల ఆసుపత్రి. ఇక్కడ వివిధ విభాగాల్లో 259 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 575 పడకల ఆసుపత్రికి ప్రతి నెల రూ. 50 లక్షలు బడ్జెట్ మంజూరు చేసేవారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిని డీఏంఈ లో కలిపే సమయంలో 420 పడకలకు ఏంవోఐ చేశారు. దీంతో ప్రతి నెల రూ. 50 లక్షలు రావాల్సిన బడ్జెట్ రూ. 35 లక్షలు మంజూరు చేయడంతో కార్మికులకు ప్రతి నెల జీతాలు ఇవ్వడంలో అడ్డంకులు వస్తున్నాయి. ఈ విషయం పై గతంలో డీఎంఈ దృష్టికి తీసుకొని వెళ్ళిన సమస్య పరిష్కారం కావడం లేదని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story