Kejriwal: ఓటర్ల జాబితా తారుమారు చేసేందుకు ఆపరేషన్ లోటస్.. బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు

by Shamantha N |
Kejriwal: ఓటర్ల జాబితా తారుమారు చేసేందుకు ఆపరేషన్ లోటస్.. బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ (Delhi) మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ లోటస్ పేరుతో దేశరాజధానిలో ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లడారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదనే విషయం బీజేపీకి అర్థమైంది. వారికి సీఎం అభ్యర్థి లేరు. విజన్ లేదు. విశ్వాసనీయ అభ్యర్థులు లేరు. అందుకే, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకే, ఆపరేషన్ లోటస్ ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ఓటరు జాబితాను ట్యాంపరింగ్‌ చేసింది’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.

న్యూఢిల్లీలో ఓట్లర్ల తొలగింపు..

న్యూఢిల్లీలోని షహదారాలో 11,800 ఓట్లు తొలగించాలని బీజేపీ దరఖాస్తు చేసిందని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో ఆచర్యను నిలిపివేశారన్నారు. ‘‘కొన్ని రోజులుగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తన ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది. ఈ 15 రోజుల్లో 5 వేల మంది ఓటర్లను తొలగించేందుకు కొత్తగా దరఖాస్తులు వచ్చాయి. అంతేకాకుండా.. 7,500 మంది ఓటర్లను జాబితాలో చేర్చేందుకు అప్లికేషన్లు వచ్చాయి. 12 శాతం ఓట్లలో అవకతవకలు జరుగుతున్నాయి’’ అని కేజ్రీవాల్‌ అన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ భార్య ఓటును తొలగించేందుకు బీజేపీ దరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. 2 నుంచి 4 శాతం ఓట్లను తొలగించడం లేదా చేర్చడాన్ని క్షుణ్ణంగా ధ్రువీకరించాలని అధికారులను ఆయన కోరారు. చట్టాన్ని అనుసరించాలని మరియు రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కూడా "ఎన్నికలను రిగ్ చేయడానికి బీజేపీ ఆలోచనలు చేస్తోంది" అని ఆరోపించారు. ఇక, త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 70 స్థానాలకు అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed