ఎమ్మెల్సీ పోల్స్‌లో ‘మహా’యుతి జయకేతనం

by Hajipasha |
ఎమ్మెల్సీ పోల్స్‌లో ‘మహా’యుతి జయకేతనం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి సత్తా చాటుకుంది. మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగగా.. 9 చోట్ల మహాయుతి కూటమి విజయఢంకా మోగించింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ, చెరో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అజిత్ పవార్ ఎన్సీపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన గెలిచాయి. విపక్ష మహా వికాస్ అఘాడి కూటమిలోని కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే శివసేన చెరొక స్థానంలో నెగ్గాయి.

విపక్ష కూటమిలోని శరద్ పవార్ ఎన్సీపీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీజేంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ) తరఫున పోటీ చేసిన జయంత్ పాటిల్‌కు మద్దతు పలికింది. అయితే జయంత్ ఓడిపోయారు. మహారాష్ట్ర శాసన మండలిలోని 11 మంది ఎమ్మెల్సీలు ఈనెల 27న పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు భర్తీ చేయనున్నారు. ఆరాష్ట్ర శాసనమండలి లెక్కల ప్రకారం.. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే కనీసం 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 103 మంది, షిండే శివసేనకు 38, అజిత్ పవార్ ఎన్‌సీపీకి 42, కాంగ్రెస్‌కు 37, శివసేన (యూబీటీ)కి 15, శరద్ పవార్ ఎన్సీపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed