Bihar: బిహార్‌లో కుప్పకూలిన మరో వంతెన.. నిర్మాణంలో ఉండగానే ఘటన

by vinod kumar |
Bihar: బిహార్‌లో కుప్పకూలిన మరో వంతెన.. నిర్మాణంలో ఉండగానే ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ రాష్ట్రంలో మరో వంతెన కుప్పకూలింది. గంగా నదిపై నిర్మిస్తున్న భాగల్‌పూర్‌, ఖగారియా జిల్లాను కలిపే సుల్తాన్‌గంజ్-అగువానీ బ్రిడ్జ్‌లో కొంత భాగం శనివారం నదిలో పడిపోయింది. నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత ఈ బ్రిడ్జ్ కూలిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనను అక్కడే ఉన్న స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పనులు పూర్తి కాక ముందే మూడు సార్లు కుప్పకూలడంతో నిర్మాణ పనుల్లో నాణ్యతపై సందేహం నెలకొంది.

ఎస్‌కె సింగ్లా కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ రూ.1,710 కోట్ల అంచనా వ్యయంతో ఈ వంతెనను నిర్మిస్తోంది. ఈ ప్రాంతంలోని కీలక లింక్ అయిన విక్రమశిల వంతెనపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ బ్రిడ్జ్ కడుతున్నారు. చివరి సారిగా గతేడాది జూన్ 4న వంతెన ఒక భాగం కూలిపోయింది. అంతకుముందు 2022 జూన్ 30న మరి కొంత భాగం ధ్వంసమైంది. దీంతో ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్కే సింగ్లా కన్‌స్ట్రక్షన్ ప్రయివేట్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది. వంతెనను కంపెనీ ఖర్చుతో నిర్మించాలని ఆదేశించింది. దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించగా.. అవసరమైతే డిజైన్‌ను సరిచేయాలని పాట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వంతెన పనులు 2014లో ప్రారంభించారు. కాగా, బిహార్‌లో ఇటీవల పదికి పైగా వంతెనలు కూలిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story