బీజేపీకి బిగ్ షాక్! ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో నోట్ల కుప్పలు

by Sathputhe Rajesh |
బీజేపీకి బిగ్ షాక్! ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో నోట్ల కుప్పలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన వేళ లంచం తీసుకుంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అడ్డంగా దొరికిపోయాడు. అతడి ఇంట్లో నోట్ల కట్టలు కుప్పలుగా లభించడం సంచలనంగా మారింది. కర్ణాటక చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కుమార్ లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.

గురువారం తన కార్యాలయంలో రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ప్రశాంత్ కుమార్ నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటల వరకు జరిపిన సోదాల్లో సుమారు రూ.6 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎమ్మెల్యే విరూపాక్షప్ప కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ గా వ్యవరిస్తున్నాడు. ఈ కంపెనీ ప్రముఖ మైసూర్ సాండల్ సోప్ అనే సబ్బులను తయారు చేస్తోంది.

ఈ సబ్బుతో పాటు ఇతర డిటెర్జెంట్ల తయారీకి కావాల్సిన ముడి పదార్థాల సప్లై చేసే కాంట్రాక్ట్ విషయంలో రూ.80 లక్షల లంచం ఇవ్వాల్సిందిగా ఓ వ్యాపారికి ప్రశాంత్ డిమాండ్ చేయడంతో అతడు లోకాయుక్తను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు ప్రశాంత్ అవినీతి చిట్టాను విప్పుతున్నారు. నిందితుడితో పాటు డబ్బులు ఇచ్చేందుకు వచ్చిన అతడి బంధువును, అకౌంటెంట్ సురేంద్ర, నికోలస్ గంగాధర్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఎన్నికల ముంగిట్లో ఈ పరిణామం ప్రతిపక్షాలకు ఓ ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే 40 శాతం కమిషన్ గవర్నమెంట్ అని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో ఇంత మొత్తం నగదు వెలుగు చూడటం దుమారం రేపుతోంది. అయితే కర్ణాటక ప్రభుత్వం గతేడాది అవినీతి శాఖను రద్దు చేసి దాని స్థానంలో లోకాయుక్తను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం బసవరాజు బొమ్మై రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకే లోకాయుక్తను తీసుకువచ్చామని అన్నారు.

ఈ కేసుకు సంబంధించి లోకాయుక్త వద్ద అన్ని వివరాలు ఉన్నాయని ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు అనే వివరాలన్ని బయటకు వస్తాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఎన్నో కేసులు వెలుగు చూశాయని చెప్పారు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed