రూ.29కే కిలో సన్న బియ్యం.. ఎక్కడ కొనొచ్చంటే..?

by Swamyn |
రూ.29కే కిలో సన్న బియ్యం.. ఎక్కడ కొనొచ్చంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో: పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు కాస్త ఊరట కలిగించేలా కేంద్రం ‘భారత్ రైస్’ను తీసుకొచ్చింది. సబ్సిడీపై కిలో రూ.29కే లభించనున్న ఈ బియ్యం విక్రయాలను కేంద్రం మంగళవారం ప్రారంభించింది. చౌకధరకే లభించే ఈ నాణ్యమైన బియ్యం అమ్మకాలను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌ వేదికగా మంగళవారం ప్రారంభించారు. అలాగే, 100 మొబైల్ వ్యాన్లనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా పియూష్ గోయల్ మాట్లాడుతూ, దేశ ప్రజల అవసరాల పట్ల ప్రధాని మోడీ ఎంతో సున్నిత మనస్తత్వంతో ఆలోచిస్తారని, అందుకే నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచేందుకు నిత్యం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ‘భారత్ రైస్‌’ను తీసుకొచ్చామని చెప్పారు. చౌక ధరలకే నాణ్యమైన బియ్యం అందించడం వల్ల మార్కెట్లో వాటి ధరలు నియంత్రణలో ఉంటాయని తెలిపారు.

ఎక్కడ కొనొచ్చంటే.?

భారత్ రైస్‌ను ప్రస్తుతానికి మూడు కేంద్ర సహకార సంస్థల ద్వారా కేంద్రం విక్రయించనుంది. కేంద్రీయ భండార్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్(ఎన్‌సీసీఎఫ్) కేంద్రాలతోపాటు వాటి మొబైల్ అవుట్‌లెట్లలోనూ మంగళవారం నుంచే అందుబాటులో ఉన్నాయని పియూష్ గోయల్ తెలిపారు. త్వరలోనే రిటైల్ దుకాణాలతోపాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్(అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి)లోనూ భారత్ రైస్ అందుబాటులోకి వస్తాయని అన్నారు. కుటుంబానికి అనుకూలంగా 5కేజీలు, 10కేజీల బ్యాగ్‌లలో ఈ బియ్యం విక్రయించనున్నట్టు చెప్పారు. అయితే, కొనుగోలుపై ఏమైనా పరిమితి విధిస్తారా? లేదా ఎంతైనా కొనొచ్చా? అనే వివరాలేవీ వెల్లడించలేదు. కాగా, ఇప్పటికే ‘భారత్ ఆటా’ పేరుతో కిలో గోధుమ పిండి రూ.27.5, ‘భారత్ చనా’ పేరుతో కిలో శనిగపప్పును కేంద్రం రూ.60కే విక్రయిస్తున్న విషయం తెలిసిందే. వీటికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ‘భారత్ రైస్’కు సైతం ఇదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.


Advertisement

Next Story