ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు.. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షురూ

by Hajipasha |
ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు.. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షురూ
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘మా ‘మన్ కీ బాత్’ చెప్పడానికి మేం రాలేదు. మీ ‘మన్ కీ బాత్’ వినడానికి మాత్రమే వచ్చాం’’ అని భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. మణిపూర్ ప్రజల బాధ గురించి తాము తెలుసుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇక్కడి ప్రజలతో సోదరభావం, సామరస్య దృక్పథాన్ని పంచుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా ఖోంగ్‌జోమ్ వార్ మెమోరియల్ వద్ద ప్రారంభమైంది. ఈసందర్భంగా ఖోంగ్‌జోమ్ వార్ మెమోరియల్ వద్ద రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యాత్ర ప్రారంభానికి సంకేతంగా రాహుల్ గాంధీ చేతికి మల్లికార్జున ఖర్గే భారత జాతీయ జెండాను అందజేశారు. 1891 నాటి ఆంగ్లో-మణిపూర్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు స్మారకంగా ఖోంగ్‌జోమ్ వార్ మెమోరియల్‌ను నిర్మించారు. ఇక యాత్రలో భాగంగా ఖోంగ్‌జోమ్‌లోని ఒక మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభ నిర్వహించింది.

మణిపూర్‌లో ప్రతిమూలన విద్వేషం..

ఇందులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ‘‘నేను గత సంవత్సరం జూన్ 29న మణిపూర్‌కు వచ్చాను. రాష్ట్రంలో హింసాకాండ వేళ జరిగిన ఎన్నో దారుణాల గురించి అప్పుడు విన్నాను. 2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఒక రాష్ట్రంలో పాలన కుప్పకూలుతుండటాన్ని తొలిసారిగా చూశాను. మణిపూర్‌లోని ప్రతిమూల ఇప్పుడు విద్వేషం వల్ల విభజించబడింది’’ అని చెప్పారు. కొన్ని నెలల పాటు మణిపూర్‌లో జరిగిన హింసాకాండ వల్ల లక్షల మంది ప్రభావితమయ్యారని తెలిపారు. కుటుంబ సభ్యుల ముందే ఎంతోమంది హత్యకు గురయ్యారన్నారు. ‘‘ప్రజల కన్నీళ్లు తుడవడానికి ప్రధాని మోడీ మణిపూర్‌‌కు రాలేదు. బహుశా ఆయన ప్రకారం మణిపూర్ అనేది భారతదేశంలో భాగం కాకపోవచ్చు. మీ బాధ ప్రధాని బాధ కాదని తేలిపోయింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యాప్తి చేస్తున్న విద్వేష రాజకీయాలకు, భావజాలానికి మణిపూరే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయాలను ఎత్తిచూపేందుకే తన యాత్రలో ‘న్యాయ్’ అనే పదాన్ని చేర్చామన్నారు.

బీచ్‌లలో ప్రధాని మోడీ విహారయాత్రలు..

“మాది సుదీర్ఘ ప్రయాణం. ఇలాంటి యాత్ర గతంలో ఎన్నడూ జరగలేదు. భవిష్యత్తులో కూడా జరగదని అనుకుంటున్నా. ఓట్లు అడగడానికి మోడీ మణిపూర్‌కు వస్తాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉండగా... ప్రధాని మోడీ బీచ్‌లలో విహారయాత్రకు వెళ్తున్నారు. రాముడి పేరుతో మతపరమైన పనులు చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాహుల్ గాంధీ గత జూన్‌లోనూ రాష్ట్రాన్ని సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ పీఠికను రక్షించేందుకు రాహుల్ పోరాడుతున్నారని, ఆయన యాత్రకు అండగా నిలవాలని కాంగ్రెస్ శ్రేణులకు ఖర్గే పిలుపునిచ్చారు.

Advertisement

Next Story