యువకుడిపై లైంగిక వేధింపులు.. దేవెగౌడ మరో మనవడికి 14 రోజుల కస్టడీ

by Hajipasha |
యువకుడిపై లైంగిక వేధింపులు.. దేవెగౌడ మరో మనవడికి 14 రోజుల కస్టడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మరో మనవడు, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. సూరజ్ లైంగిక దాడి చేశాడని చేతన్ అనే జేడీఎస్ పార్టీ కార్యకర్త హూలెనరసిపురా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో శనివారమే కేసు నమోదు చేశారు. సూరజ్‌పై ఐపీసీ సెక్షన్లు 377 (అసహజ సెక్స్), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు పెట్టారు. ఇక బాధితుడు చేతన్‌కు స్థానిక ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేయగా.. ఒంటిపై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సూరజ్ రేవణ్ణను పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని 42వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట సూరజ్‌ను పోలీసులు ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది. సూరజ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కర్ణాటక సీఐడీ సోమవారం రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

కేసు వివరాల్లోకి వెళితే.. జూన్​16న సాయంత్రం సూరజ్ రేవణ్ణ ఫామ్​హౌస్​లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 27 ఏళ్ల చేతన్ అనే పార్టీ కార్యకర్త ఆరోపించాడు. లోక్‌సభ ఎన్నికలలో తన పనిని చూసి ఆయన వీలున్నప్పుడల్లా తనను కలవాలని కోరాడని, ఈ క్రమంలో ఆయన వద్దకు వెళ్లగా బలవంతంగా లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడని తెలిపాడు. ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ తోసిపుచ్చారు. ఆ వ్యక్తి తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని, తాను ఇవ్వకపోవడంతో తప్పుడు ఫిర్యాదు చేశాడని చెప్పాడు. ఇక సూరజ్‌ అనుచరుడు శివకుమార్ కూడా హోళినరిసిపురం పోలీస్ స్టేషన్‌లో‌ చేతన్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ నెల ప్రారంభంలో చేతన్ తనను కలిశాడని, ఉద్యోగం ఇప్పించాలని కోరగా అతడికి సూరజ్ ఫోన్ నంబర్ ఇచ్చి సంప్రదించాలని చెప్పానన్నాడు. సూరజ్ ద్వారా ఉద్యోగం రాకపోవడంతో చేతన్ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కొద్ది రోజులకే సూరజ్ అరెస్ట్ కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed