ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన బెంగళూరు కోర్టు

by Harish |
ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన బెంగళూరు కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు బుధవారం తిరస్కరించింది. లైంగిక ఆరోపణలపై ప్రజ్వల్‌ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై కర్ణాటకలోని హోలెనరసిపురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతకు ముందు ఇదే కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రజ్వల్‌ బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని కొట్టివేసింది, తాజాగా మరోసారి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బుధవారం విచారణ సందర్బంగా ఇరుపక్షాల వాదలను విన్న కోర్టు నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, బెయిల్ మంజూరు చేయరాదని నిర్ణయించింది.

ఇదిలా ఉంటే ఇటీవల తాజాగా ఆయనపై నాలుగో కేసు నమోదైంది. బాధితుల ఫొటోలను రహస్యంగా రికార్డ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కొత్త ఎఫ్‌ఐఆర్‌లో ప్రజ్వల్ కాకుండా మరో ముగ్గురు వ్యక్తుల పేర్లు ఉన్నాయి, వీరిలో హసన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ్ కూడా ఉన్నారు. మరోవైపు ప్రజ్వల్ సోదరుడు సూరజ్ రేవణ్ణ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ , సూరజ్ రేవణ్ణ ఇద్దరూ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవళ్లు.

Advertisement

Next Story

Most Viewed