ఎన్నికల్లో పోటీకి నో చెప్పిన ప్రియాంకాగాంధీ.. ఎందుకో తెలుసా ?

by Hajipasha |   ( Updated:2024-05-03 14:39:50.0  )
ఎన్నికల్లో పోటీకి నో చెప్పిన ప్రియాంకాగాంధీ.. ఎందుకో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రియాంకాగాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతారని అందరూ భావించారు. కానీ ఆ అంచనా తలకిందులైంది. అమేథీ లేదా రాయ్‌బరేలీలలో ఏదైనా ఒక లోక్‌సభ స్థానాన్ని ఎంపిక చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరినా.. అందుకు ప్రియాంక నో చెప్పారట. ఇంతటి కీలక ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించడం వెనుక ముందుచూపు దాగి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏదో ఒక స్థానం నుంచి గెలిస్తే లోక్‌సభకు వెళ్తారు. ఒకవేళ తాను కూడా లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిస్తే.. గాంధీ ఫ్యామిలీ నుంచి పార్లమెంటులో ఉండే నాయకుల సంఖ్య మూడుకు పెరిగింది.

ఒకవేళ ఈ ఎన్నికల్లో తాను పోటీకి దిగినా.. బీజేపీకి చేతికి పెద్ద విమర్శనాస్త్రాన్ని ఇచ్చినట్లు అవుతుందని ప్రియాంకాగాంధీ భావిస్తున్నారట. వంశపారంపర్య రాజకీయాలను కాంగ్రెస్ పెంచిపోషిస్తుందనే అంశాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఆమె అనుకున్నారట. అందుకే తాను ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండి, కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అందుబాటులో ఉండాలని డిసైడయ్యారట. అన్ని రాష్ట్రాల పార్టీల ముఖ్య నేతలతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఏయే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే దానిపై మంచి అవగాహన కూడా ఉంది. వెరసి, భవిష్యత్తులో సరైన సమయం చూసుకొని ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed