శునకాలకు కూడా ప్రత్యేక విమానం.. ప్రారంభించిన 'బార్క్ ఎయిర్'

by S Gopi |
శునకాలకు కూడా ప్రత్యేక విమానం.. ప్రారంభించిన బార్క్ ఎయిర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మనుషులతో పాటు శునకాలకు కూడా విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు ప్రారంభించిన కొత్త ఎయిర్‌లైన్ సంస్థ బార్క్ ఎయిర్ తన మొట్టమొదటి విమానాన్ని ప్రారంభించింది. ప్రముఖ బొమ్మల తయారీ కంపెనీ బార్క్ ఓ జెట్ చార్టర్ సర్వీస్ భాగస్వామ్యంతో బార్క్ ఎయిర్‌ను స్థాపించింది. ఈ కంపెనీ అన్ని రకాల శునకాలకు వాటి యజమానులతో పాటు లగ్జరీ విమానయాన సేవలను అందిస్తుంది. తాజాగా న్యూయార్క్ నుంచి లాస్ ఏంజిల్స్‌కు బార్క్ ఎయిర్ విమానం గురువారం బయలుదేరిందని కంపెనీ తెలిపింది. తమ విమానం సాధారణ ఫ్లైట్‌ల తరహాలో శునకాలను కేవలం కార్గో లేదా ఇతర ప్రమాణాలుగా పరిగణించకుండా శునకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రూపొందించామని, పూర్తిగా శునకాలకు అనువైన విధంగా విమానంలో సౌకర్యాలు ఉంటాయని కంపెనీ వివరించింది. ఈ అరుదైన ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు దశాబ్ద కాలం పట్టిందని, ఇన్నాళ్లకు శునకాలకే ప్రత్యేకంగా, వాటికి తొలి ప్రాధాన్యత ఇస్తూ విమానాన్ని ప్రారంభించడం సాధ్యమైందని పేర్కొంది. దీని గురించి కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇది చాలా ప్రోత్సాహకరమైన ప్రయత్నమని, జంతువులను కార్గోలో తీసుకెళ్లే పద్దతిలో కాకుండా అవి సురక్షితంగా ప్రయాణించే సేవలు ప్రారంభించడం జంతు వైద్యునిగా సంతోషిస్తున్నట్టు ఓ వ్యక్తి చెప్పాడు. కంపెనీ వివరాల ప్రకారం, అమెరికాలో స్థానికంగా శునకాల విమాన ప్రయాణానికి టికెట్ ధర 6,000 డాలర్లు ఖర్చవుతుంది. అంతర్జాతీయ ప్రయాణానికి ఒక్కో టికెట్ 8,000 డాలర్లు ఉంటుంది. డిమాండ్ పెరిగేకొద్దీ విమాన టికెట్ ధరలు ఇంకా తగ్గుతాయని కంపెనీ చెబుతోంది.

Advertisement

Next Story