Bangla citizens: చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్న బీఎస్ఎఫ్.. నలుగురు బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్

by vinod kumar |
Bangla citizens: చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్న బీఎస్ఎఫ్.. నలుగురు బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో బీఎస్ఎఫ్ దళాలు చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన నలుగురు బంగ్లాదేశ్‌, ఒక భారతీయ పౌరుడిని అరెస్ట్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాంటియర్‌లోని సరిహద్దు ప్రాంతంలో రక్షణగా ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది ఐదుగురు వ్యక్తుల అనుమానాస్పద కదలికలను గమనించారు. ఈ క్రమంలో వారి వద్దకు వెళ్తుండగా జవాన్లను గమనించిన చొరబాటుదారులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే ఆ ప్రాంతంలో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను మోహరించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారిలో నలుగురు బంగ్లాదేశ్ పౌరులు కాగా మరొకరు ఇండియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వారి వద్ద నుంచి నాలుగు నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బంగ్లాదేశ్ పౌరులను విచారించగా, వారు తమ దేశంలోని గోదాగరి సబ్-జిల్లాలో నకిలీ భారతీయ ఆధార్ కార్డులను సృష్టించినట్టు తెలిపారు. నకిలీ గుర్తింపు పత్రాల కోసం ఒక్కొక్కరు 1,000 బంగ్లాదేశ్ టాకా చెల్లించినట్టు వెల్లడించారు. చెన్నయ్‌లో రోజువారీ కూలీగా పనిచేయడానికి వెళ్తున్నట్టు తెలిపారు. భారత పౌరుడిని విచారించగా బంగ్లాదేశ్ పౌరులకు సహకరించేందుకు అంతర్జాతీయ సరిహద్దు వద్దకు వచ్చానని అంగీకరించారు. భారత్‌లోకి చొరబడిన తర్వాత ప్రతి పౌరుడికీ రూ. 4000 ఇస్తానని చెప్పినట్టు వెల్లడించారు. విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed